UP Cold Storage Roof Collapse Deaths Rise To 10: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. శుక్రవారం నాటికి ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 10కి చేరుకుంది. సంభాల్ జిల్లాలోని కోల్డ్ స్టోరేజ్ పైకప్పు కూలింది. కోల్డ్ స్టోరేజీ కుప్పకూలిన ఘటనలో శిథిలాల నుంచి 21 మందిని బయటకు తీస్తే ఇందులో 10 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై యోగి ఆదిత్య నాథ్ దర్యాప్తు చేయడానికి కమిటీని ఏర్పాటు చేశారు.
Read Also: Mallikarjun Kharge: బీజేపీ వాళ్లే దేశ వ్యతిరేకులు.. బ్రిటీష్ వారి కోసం పనిచేశారు.
ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, తీవ్రగాయాల పాలైనవారికి రూ. 50,000 పరిహారాన్ని అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారిందరికి ఉచిత చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పైకప్పు కూలిపోవడానికి గల కారణాలపై విచారణ జరిపేందుకు మొరాదాబాద్‌లోని పోలీసు కమిషనర్, డీఐజీ నేతృత్వంలో విచారణ కమిటీని కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ తన నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరినట్లు అధికారులు తెలిపారు.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) రెస్య్కూ ఆపరేషన్ రాత్రి వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. రాత్రి సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు సెర్చ్ లైట్స్ ఏర్పాటు చేశారు. మంత్రులు గులాబ్ దేవి, ధరమ్ పాల్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కోల్డ్ స్టోరేజిని అనుమతి లేకుండా మూడు నెలల క్రితం నిర్మించినట్లు, దీంట్లో స్టోర్ చేసిన బంగాళాదుంపల పరిమాణం స్టోరేజ్ పరిమాణానికి మించి ఉందని పోలీసులు వెల్లడించారు. కోల్డ్ స్టోరేజ్ యజమానులైన అంకుర్ అగర్వాల్, రోహిత్ అగర్వాల్‌లపై కేసులు నమోదు చేశారు.