మహారాష్ట్రలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే పార్టీలో చీలిక తీసుకువచ్చారు. మొత్తం 57 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఏక్ నాథ్ షిండే క్యాంపులోకి 39 మంది ఎమ్మెల్యేలు చేరారు. దాదాపుగా ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే క్యాంపులో 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఉద్ధవ్ క్యాంపు నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏక్ నాథ్ షిండే సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగిన జిల్లా అధ్యక్షుల సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వర్ష బంగ్లా ( సీఎం నివాసం) నుంచి మాత్రమే వెళ్లిపోయానని.. పోరాటం వదిలిపెట్టలేదని ఆయన అన్నారు. మరిన్ని నిర్ణయాలతో పోరాడుతానని ఆయన అన్నారు. ఏక్ నాథ్ షిండేకు నగరాభివృద్ధి వంటి కీలక శాఖ ఇచ్చామని.. గతంలో ఇది సీఎం వద్దే ఉండేదని ఆయన అన్నారు. ఏక్ నాథ్ షిండే కుమారుడికి కూడా పార్లమెంట్ అవకాశం ఇచ్చామని.. షిండేకు అన్ని రకాల గుర్తింపు ఇచ్చానా.. ఆయన మమ్మల్ని మోసం చేశారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
ఛత్రపతి శివాజీ కాలంలో ప్రత్యర్థులు గ్రామాల తర్వాత గ్రామాలను యుద్ధంలో నాశనం చేసే వారని.. అయితే శివాజీ తనతో కలిసి ఉన్న నిజాయితీపరులతో కలిసి ఆ గ్రామాలను పునర్నిర్మించారని.. పార్టీ పునర్నిర్మాణానికి అందరం కృషి చేయాలని ఉద్ధవ్ అన్నారు. నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని మీరు కోరుకుంటే, నేను దానిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని.. నేను పదవికి, కుర్చీకి అతుక్కుపోయే వ్యక్తిని కాదని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.