దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ టైలర్ హత్యోదంతంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లత్ కీలక విషయాల్ని వెల్లడించారు. హంతకులకు అంతర్జాతీయంగా ఉగ్రవాద సంబంధాలున్నాయని, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకే ఆ టైలర్ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులై వెల్లడైందని ఆయన తెలిపారు. ‘‘ఈ హత్యోదంతంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకే ఈ హత్య జరిగినట్లు వాళ్లు తెలిపారు. ఆ ఇద్దరు నిందితులకు ఇతర దేశాల్లోనూ కాంటాక్ట్స్ ఉన్నట్టు తేలింది’’ అని సీఎం అన్నారు.
అంతేకాదు.. ఈ హత్య కేసు ఘటనపై తదుపరి విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపడుతుందని, వారికి రాజస్థాన్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశామన్న ఆయన.. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని ఇతర రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇద్దరు నిందితుల్లో ఒకరు 2014 కరాచీలోని పాక్ తీవ్రవాద సంస్థ దావత్-ఎ- ఇస్లామీకి వెళ్లినట్లు రాజస్థాన్ డీజీపీ ఎంఎల్ లాథర్ పేర్కొన్నారు.
కాగా.. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతు తెలిపాడని, ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్‌ను ఇద్దరు దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. హంతకుల్ని గౌస్ మహ్మద్, రియాజ్ అహ్మద్‌లుగా గుర్తించారు. మృతుడు కన్హయ్య కుటుంబానికి రూ.31 లక్షల పరిహారంతో పాటు ఇద్దరు కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.