F-35 fighter jet: అమెరికాలో భారత ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ముగిసింది. అంతకుముందు వైట్ హౌజ్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, ఒప్పందాలపై చర్చించారు. అయితే, ఈ సమయంలో భారత్‌కి ట్రంప్ ‘‘F-35 స్టెల్త్ ఫైటర్ జెట్స్’’ ఆఫర్ చేశారు. ప్రపంచంలో ఉన్న యుద్ధవిమానాల్లో F-35 అత్యంత అడ్వాన్సుడ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన యుద్ధవిమానంగా పేరుంది. ఈ ఉంటే శత్రుదేశాలు హడలి చావాల్సిందే. ‘‘మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాము. చివరికి భారతదేశానికి F-35 స్టీల్త్ ఫైటర్లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నాము’’ అని ట్రంప్ స్యంగా ప్రకటించారు.
F-35 5వ జనరేషన్ యుద్ధవిమానం. స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంది. శత్రుదేశాల రాడార్లకు దొరకకుండా దాడులు చేయగలిగే సత్తా దీని సొంతం. దీంట్లో అధునాతన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, ఓపెన్ ఆర్కిటెక్చర్, అడ్వాన్సుడ్ సెన్సార్లు ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా ఇది సుదూరాల్లో ఉన్న లక్ష్యాలపై ఈజీగా దాడులు చేయగలదు.
F-35 వేరియంట్లు – వాటి ధరలు:
F-35A: ఇది సాంప్రదాయిక టేకాఫ్, ల్యాండింగ్ వెర్షన్ దీనిని ప్రధానంగా యూఎస్ వైమానిక దళం ఉపయోగిస్తుంది. దీని ధర యూనిట్ కి 80 మిలియన్ డాలర్లు.
F-35B: ఇది యూఎస్ మెరైన్ కార్ప్స్ ఉపయోగించే షార్ట్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ (STOVL) వేరియంట్. దీని ధర యూనిట్‌కు దాదాపు $115 మిలియన్లు.
F-35C: ఇది యూఎస్ నేవీ కోసం రూపొందించారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఆధారిత వెర్షన్. దీని ధర ఒక్కదానికి $110 మిలియన్లు.
అయితే, దీని కొనుగోలు ఖర్చుతో పాటు దీనిని నడపడం వల్ల కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్క గంట ఆకాశంలో ఉంటే, దీని నిర్వహణకు 36,000 డాలర్లు ఖర్చు అవుతుంది.
మిత్రదేశాలకు సరఫరా:
అమెరికా తన మిత్రదేశాలకు కూడా F-35 ఫైటర్ జెట్లను ఇచ్చింది. ఆస్ట్రేలియా వద్ద 72 జెట్లు ఉన్నాయి. యూకే, ఇటలీ, నార్వేల వద్ద ఈ యుద్ధవిమానాలు ఉన్నాయి. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ యొక్క ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రామ్ ద్వారా, జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ కూడా ఈ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి.
ఒక వేళ భారత్ ఈ ఆఫర్‌ని అంగీకరిస్తే, ఎఫ్-35 యుద్ధవిమానం పొందే తొలి నాటోయేతర, ఫసిఫికేతర యూఎస్ మిత్రరాజ్యంగా అవతరిస్తుంది. ప్రస్తుతం భారత్ వద్ద అత్యాధునికి రాఫెల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇది 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్ జెట్. భారతదేశ అవసరాల కోసం రూపొందించబడిన రాఫెల్ జెట్ ఒక్కదాని ధర 110-120 మిలియన్ డాలర్లు. ఎఫ్-35 మాదిరిగా రాఫెల్‌కి స్టెల్త్ సామర్థ్యం లేదు.
సవాళ్లు అనేకం:
ఎఫ్-35 భారత దేశ వైమానిక సామర్థ్యాన్ని బలోపేతం చేయగలదు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఖర్చు-నిర్వహణ అనేది ఇక్కడ సవాల్‌గా మారింది. ఇదే కాకుండా దీని మౌలిక సదుపాయాలకు, దీనిని నడిపేందుకు ప్రత్యేక పైలట్ శిక్షణ అవసరం.