Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. అయితే, కేజ్రీవాల్‌ని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆరోపిస్తోంది. తాజాగా ఆయన షుగర్ వ్యాధి, ఇన్సులిన్ వాడకంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు తీహార్ జైల్ అధికారులు నివేదిక పంపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఇన్సులిన్ తీసుకోవడం మానేశారని, మధుమేహానికి సంబంధించి నోటి ద్వారా తీసుకునే మెడిసిన్స్ వాడుతున్నారని ఎల్జీకి ఇచ్చిన రిపోర్టును ఉటంకిస్తూ శనివారం అధికారులు తెలిపారు.
తెలంగాణ బేస్డ్ ప్రైవేట్ క్లీనిక్ కేజ్రీవాల్‌కి చికిత్స ఇస్తోంది. తెలంగాణకు చెందిన డాక్టర్ సలహా ప్రకారం కేజ్రీవాల్ ఇన్సులిన్-రివర్సల్ ప్రోగ్రామ్‌లో ఉన్నారు. అరెస్టుకు చాలా ముందే ఇన్సులిన్ డోసులని నిలిపేశారని తీహార్ జైలు నివేదిక పేర్కొంది. ఈ నివేదికపై ఆప్ నేత, మంత్రి అతిషి స్పందిస్తూ.. నివేదిక బీజేపీ కుట్రను బహిర్గతం చేసిందని ఆరోపించారు. బీజేపీ పిలుపు మేరకు కేజ్రీవాల్‌ని జైల్లోనే చంపేందుకు కుట్ర జరుగుతోందని, 12 ఏళ్లుగా సీఎం ఇన్సులిన్ తీసుకుంటున్నారరని, ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడానికి తీహార్ అధికారులకు ఇబ్బంది ఏమిటి..? అని ప్రశ్నించారు. జైలుకు వెళ్లే ముందు కూడా కేజ్రీవాల్ 50 యూనిట్ల ఇన్సులిన్ తీసుకునేవారని ఆమె అన్నారు.
Read Also: Nagari: మంత్రి రోజాకు షాక్.. టీడీపీ గూటికి మంత్రి ప్రధాన అనుచరుడు..
తెలంగాణకు చెందిన వైద్యుడి పర్యవేక్షణలో కేజ్రీవాల్ మధుమేహ చికిత్స నడుస్తోందని, కొన్ని నెలల క్రితమే అతను ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశారని, అరెస్ట్ చేసిన సమయంలో ఆయన మెట్‌ఫార్మిన్ అనే బేసిక్ షుగర్ ట్యాబ్లెట్లను తీసుకుంటున్నారని తీహార్ నివేదిక తెలియజేస్తోంది. తీహార్ జైలులో వైద్య పరీక్షల సమయంలో కేజ్రీవాల్ గత కొన్నేళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నానని, కొన్ని నెలల ముందు నుంచి తీసుకోవడం మానేశానని వైద్యులతో చెప్పారని నివేదిక పేర్కొంది.
‘‘ తెలంగాణకు సంబంధించిన ప్రైవేట్ క్లీనిక్‌లో కేజ్రీవాల్ చికిత్స తీసుకోవడం ఆసక్తికరమైన కేసు. ఢిల్లీలో ప్రపంచ స్థాయి ఆరోగ్య మౌలిక సదుపాయాల గురించి గొప్పగా చెప్పుకునే ఢిల్లీ ముఖ్యమంత్రి, వైద్య పత్రాలను కూడా అందించడంలో విఫలమైన దక్షిణ భారతదేశంలోని క్లినిక్‌లో రహస్యంగా చికిత్స పొందుతున్నారు.’’ అని నివేదిక పేర్కొంది. ‘‘ముఖ్యంగా ఎక్సై్జ్ కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్టు చుట్టూ ఉన్న మొత్తం ఎపిసోడ్‌లో ఈ తెలంగాణ క్లినిక్ ప్రవేశం, మద్యం పాలసీ రూపకల్పనలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించడం ఈ రెండు విషయాలు దగ్గరగా ఉన్నాయి’’ అని నివేదిక పేర్కొంది. ఆర్ఎంఎల్ హాస్పిటల్ నుంచి వైద్యులు వైద్య రికార్డుల ప్రకారం.. కేజ్రీవాల్‌కి ఎలాంటి ఇన్సులిన్ సూచించలేదు అని నివేదిక తెలిపింది. అతడి షుగర్ లెవల్స్ ఆందోళనకరంగా లేవని, ప్రస్తుతం ఇన్సులిన్ అవసరం లేదని సూచించారు. మరోవైపు ఉద్దేశపూర్వకంగా షుగర్ లెవల్స్ పెంచుకోవడానికి స్వీట్లు, మామిడి పండ్లు, ఆలూ పూరీ తింటున్నాడని, మెడికల్ బెయిల్ పొందడానికి ఇలా చేస్తున్నాడని ఈడీ కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.