S Jaishankar: భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉందని చైనా రక్షణ మంత్రి ఒకరోజు ముందు కీలక కామెంట్స్ చేశారు. దీని తర్వాతి రోజే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా తీరుపై ధ్వజమెత్తారు. సరిహద్దు ఒప్పందాలు ఉల్లంఘించిన కారణంగా చైనాతో భారత్ సంబంధాలు సరిగా లేవని ఆయన అన్నారు. పాకిస్తాన్, చైనా మినహా అన్ని పొరుగు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పరుచుకుంటోందని అన్నారు. కరేబియన్ దేశం డొమినికన్ రిపబ్లిక్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Shivraj Singh Chouhan: ప్రధాని మోడీ “నీలకంఠుడు”.. విషసర్పం విమర్శలకు కౌంటర్..
అమెరికా, యూరప్, రష్యా, జపాన్ ఇలా ఏ దేశంతో అయినా ద్వైపాక్షిక సంబంధాలను భారత్ కోరుకుంటోందని, ఆగ్నేయాసియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరుచుకోవడానికి ‘ యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని తీసుకువచ్చామని, దీంతో పాటు ఇండో పసిఫిక్ రీజియన్ లో అన్ని దేశాలతో సంబంధాలను ఏర్పరుచుకున్నానమి జైశంకర్ అన్నారు. క్వాడ్ లో సభ్యదేశంగా ఉంటూ ఇండో పసిఫిక్ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఐటూయూటూ( ఇండియా, ఇజ్రాయిల్, యూఏఈ, యూఎస్ఏ)లో సభ్యదేశంగా ఉన్నామని తెలిపారు.
పొరుగు దేశాల అభివృద్ధికి భారత్ కృషి చేస్తోందని, కోవిడ్ సంక్షోభంలో కూడా శ్రీలంకకు సహకరించామని తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్ వంటి దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడం కష్టం అని స్పష్టం చేశారు. గురువారం భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి లీషాంగ్ పుతో సమావేశం అయ్యారు. సరిహద్దుల ఉల్లంఘనల గురించి చైనాను భారత్ హెచ్చరించింది. సరిహద్దు వెంబడి చైనా సైన్యాన్ని మోహరించడం వంటి చర్యలకు పాల్పడుతుండటం వంటి ఘటనలపై భారత్ సీరియస్ గా రియాక్ట్ అయింది.