Thug Life: కమల్ హాసన్ కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో తప్పనిసరిగా విడుదల చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. విడుదలపై బెదిరింపులు రావడంపై కర్ణాటక సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా బెదిరించే వారిపై చర్యలు తీసుకోవడం మీ కర్తవ్యం అని పేర్కొంది. దీనికి రాష్ట్రం కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేయాలని చెప్పింది. కన్నడ భాషకు వ్యతిరేకంగా కమల్ హాసన్ చేసిన కామెంట్స్‌పై కన్నడిగులు ఈ సినిమాను అడ్డుకుంటున్నారు.
Read Also: Nagarjuna : పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని.. కుబేరలో యూనిక్ పాయింట్ ఉంది!
ఈ కేసులో కమల్ హాసన్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఇచ్చిన సమాధానంతో తాను సంతృప్తి చెందానని కేసును మూసేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే, అసలు పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ల తరపున హాజరైన న్యాయవాది ఎ వేలన్, మూసివేత అభ్యర్థనను వ్యతిరేకిస్తూ, బెదిరింపులు జారీ చేసిన వారిపై మార్గదర్శకాలు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాదించారు. ‘థగ్ లైఫ్’ విడుదలను ఇకపై నిరోధించకుండా చూసుకోవాలని కర్ణాటక హైకోర్టు రాష్ట్రాన్ని ఆదేశించడానికి నిరాకరించిన తర్వాత ఇది జరిగింది.
జూన్ 5న కర్ణాటకలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కన్నడ భాష ‘‘తమిళం నుంచి పుట్టింది’’ అని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యపై వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం కర్ణాటకలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. థగ్ లైఫ్ రిలీజ్‌ని అడ్డుకుంటామని కన్నడ భాష సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, అందుకు కమల్ హాసన్ నిరాకరించడంతో థగ్ లైఫ్ విడుదల కాలేదు.