నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్యుడిపై భారాన్ని మోపుతున్నాయి. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ రేట్లు పరోక్షంగా నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణం అవుతోంది. దీంతో పేదలు, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వచ్చే వారం నుంచి మరిన్ని నిత్యావసరాల ధరలు పెరుగనున్నట్లు తెలిసింది. తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయంతో జూలై 18 తరువాత నుంచి పలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగబోతున్నట్లు సమాచారం. దీంతో మరింతగా సామాన్యుడిపై భారం పడబోతోంది. పెరుగుతున్న రేట్లు ప్రజల పొదుపుపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వస్తున్న జీతం ఎక్కువగా ఖర్చులకే పోతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇటీవల నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 47వ జీఎస్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం జూలై 18 నుంచి పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్లు పెరగబోతున్నాయి. ముఖ్య డైరీ ఉత్పత్తులపై ఈ పెరుగుదల కనిపించబోతోంది. జున్ను, లస్సీ, వెన్న, పాలు, ప్యాక్ చేసిన పెరుగు, గోధుమ పిండి, ఇతర ధాన్యాలు, తేనె, పాపడ్, తృణధాన్యాలు, మాంసం, చేపలు, మడి మరియు బెల్లం వంటి ప్రీ-ప్యాకేజ్డ్ లేబుల్‌లతో సహా వ్యవసాయ వస్తువుల ధరలు జూలై నుండి పెరగనున్నాయి. ప్రస్తుతం బ్రాండెడ్, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై 5 శాత జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ముఖ్యం నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాల ఉత్పత్తుల రేట్లు పెరుగుతున్నాయి. టెట్రా ప్యాక్ పెరుగు, లస్సీ, మజ్జిగ ధరలు పెరగనున్నాయి. వీటిపై ఇంతకుముందు జీఎస్టీ విధించలేదు. తాజాగా జూలై 18 నుంచి 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.
Read Also: Bihar: దారుణం.. బతికుండగానే బాలికను పాతిపెట్టారు
వీటితో పోటు గతంలో చెక్ బుక్ ఇష్యూ చేయడానికి బ్యాంకులు వసూలు చేసే సర్వీస్ టాక్స్ ఇప్పుడు 18 శాతం కానుంది.
ఆస్పత్రుల్లో రూ.5 వేల కన్నా( నాన్ ఐసీయూ) కన్నా ఎక్కువ ధర ఉండే గదులను అద్దెకు ఇస్తే 5 శాతం జీఎస్టీ విధించనున్నారు. రోజుకు రూ. 1000 అద్దె ఉంటే హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీ, ఎల్ఈడీ లైట్లు 18 శాతం జీఎస్టీ, బ్లేడ్లు, పేపర్ కటింగ్ కత్తెరలు, పెన్సిల్ షార్పనర్లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు, కేక్ సర్వర్లపై గతంలో 12 శాతం జీఎస్టీ ఉండగా.. ఇప్పుడు ఇది 18 శాతానికి పెరగనుంది.