కూతురు అంటే లక్ష్మీ దేవితో సమానం. ఆడపిల్ల పుట్టిందంటే, తమ ఇంటికి లక్ష్మీ దేవి వచ్చిందంటూ చాలామంది సంబరాలు చేసుకుంటారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుతారు. ముఖ్యంగా.. తల్లి అయితే కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇక నానమ్మ కూడా తల్లిలాగే ప్రేమను పంచుతూ.. గారాబం చేస్తుంది. కానీ.. ఇక్కడ ఓ బాలిక పాలిట మాత్రం తల్లి, నానమ్మలు రాక్షసులయ్యారు. బతికుండగానే శ్మశానంలో వాళ్లు ఆ బాలికను పాతిపెట్టారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.
బీహార్‌లోని సారన్‌లో మర్హా నది ఒడ్డిన ఉన్న శ్మశాన వాటికలో మూడేళ్ల బాలికను ఆమె తల్లి, నానమ్మ పాతిపెట్టారు. అయితే.. కాసేపు తర్వాత సమాధి నుంచి బాలిక ఏడుపులు వినిపించాయి. తొలుత దెయ్యం అనుకొని స్థానికులు భయపడ్డారు. అనంతరం అనుమానం వచ్చి ఆ సమాధిని తవ్వి చూడగా.. బాలిక బతికే ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఆ బాలికను విచారించగా.. తన పేరు లీలా అని చెప్పింది. అంతేకాదు.. తన తల్లి, నానమ్మలే తనను పాతి పెట్టారని చెప్పింది.
తన తల్లి పేరు రాజు శర్మ అని, తల్లి పేరు రేఖా దేవి అని ఆ బాలిక వెల్లడించింది. బయటకు వెళ్దామని తన తల్లి, నానమ్మ తనతో అన్నారని.. అనంతరం శ్మశానం వద్దకు తీసుకెళ్లి, నోటిలో మట్టి కుట్టి, పాతిపెట్టి వెళ్లిపోయారని తెలిపింది. ఆ బాలిక మాటలు విని పోలీసులు సహా స్థానికుల మనసు తరుక్కుపోయింది. సజీవంగానే ఆ పాపను పాతిపెట్టాలని ఆ తల్లి, నానమ్మకి మనసెలా వచ్చిందంటూ శాపనార్ధాలు పెట్టడం మొదలుపెట్టారు. అయితే.. ఆ బాలిక తన ఊరు పేరు మాత్రం చెప్పలేకపోయింది. ఆ బాలిక కుటుంబ సభ్యుల్ని పోలీసులు గాలిస్తున్నారు.