మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతీయులకు భారీ షాక్‌నిచ్చింది. అక్టోబర్‌లో సుమారు ఇరవై లక్షల 69 వేల అకౌంట్లను నిషేధించింది. అభ్యంతరకర ప్రవర్తన పేరుతో, అందిన ఫిర్యాదుల మేరకు అకౌంట్లను సమీక్షించి నిషేధం విధించినట్లు వాట్సాప్ ప్రకటించింది. కాగా, సెప్టెంబర్‌లో సుమారు 30 లక్షల ఖాతాలను ఈ యాప్ తొలగించింది. అయితే అభ్యంతరకర ప్రవర్తన పేరుతో (గ్రూప్‌లలో అభ్యంతరకర యాక్టివిటీస్ ద్వారా) తొలగించిన అకౌంట్లు ఈసారి ఎక్కువ రికార్డు కావడం గమనార్హం.
వీటి ద్వారా ఎలాంటి సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. అబ్యూజ్ డిటెక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చర్యలు చేపటినట్లు ప్రకటించింది. ఒక అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న దగ్గరి నుంచి, దాని కార్యకలాపాలు, ఇతర గ్రూపులో వ్యవహరించిన తీరు, ఫీడ్‌బ్యాక్, రిపోర్టులు..ఇతర అకౌంట్‌లు బ్లాక్ చేయడం తదితర అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నట్లు, ఇక 500 ఫిర్యాదుల ఆధారంగా ఒక అకౌంట్‌ను రద్దు చేసినట్లు వాట్సాప్ పేర్కొంది.
భారత్‌లో ఐటీ రూల్స్ 2021 అమలులోకి వచ్చాక ఇక్కడి అకౌంట్లపై వాట్సాప్ ఎక్కువ దృష్టి పెడుతోంది. గ్రీవియెన్స్ చానెల్‌తో పాటు రకరకాల టూల్స్ సాయంతో ఇబ్బంది కరమైన అకౌంట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించుకుంటోంది. కాగా, లక్షల్లో భారతీయుల అకౌంట్లను నిషేధించడంలో వాట్సాప్‌పై విమర్శలు మొదలయ్యాయి. ఇక్కడి యూజర్లపై ఆ సంస్థ అతి చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తాము ఎటువంటి అతిక్రమణలకు పాల్పడకున్నా… తమ అకౌంట్లు డిలీట్ అవుతుండడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైగా వాట్సాప్ రిలీజ్ చేసే మంత్లీ కంప్లైయన్స్ రిపోర్టులకు ఎలాంటి అధికారికత లేకపోవడంతో.. నిజంగానే సమీక్షించి చర్యలు చేపడుతోందా? అనే సందేహాలు కలుగక మానదు. ఈ ఏడాది వేసవి నుంచి ఇప్పటిదాకా దాదాపు రెండు కోట్లకు పైగా భారతీయుల అకౌంట్లను వాట్సాప్ నిషేధించిందని గణాంకాలు చెప్తున్నాయి.