Ayutthaya: హైందవం ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పడు ఇస్లామిక్ దేశాలుగా చెప్పబడుతున్న పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియాతో పాటు మయన్మార్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కూడా హిందూ మతానికి చెందిన ఆనవాళ్లు లభిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇండోనేషియాలో ఇస్లాం మతస్తులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చాలా మంది హిందూ ఆచారాలను పాటిస్తూనే ఉన్నారు. ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ పేరు ‘గరుడ’ అని పెట్టుకున్నారంటే, వారు ఎంతగా ఈ హిందూ జీవనశైలితో మమేకమయ్యారో తెలుసుకోవచ్చు.
ఇదిలా ఉంటే మన అయోధ్య లాగే థాయ్‌లాండ్‌లో ఓ అయోధ్య ‘అయుత్తయ’ పేరుతో ఓ నగరం విలసిల్లింది. ఇది దేశ రాజధాని బ్యాంకాక్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్-థాయ్‌లాండ్ భౌగోళికంగా 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ఆ దేశంలో కూడా రామ నామం వినిపిస్తోంది. ఇక అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మూడు రోజులే సమయం ఉంది. ఆ రోజే థాయ్‌లాండ్ వ్యాప్తంగా భారీ వేడుకలకు అక్కడి ప్రజలు సిద్ధమవుతున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణంలో థాయ్‌లాండ్ లోని మూడు నదులైన చావో ఫ్రయా, లోప్ బురి, పా సక్ వంటి నీటిని వాడారు.
ఈ చావో ఫ్రాయా నది ఒడ్డునే ఈ పురాతన అయుతయ నగరం ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఈ ప్రాంతం ఉంది. జనవరి 22న ‘ప్రాణ ప్రతిష్ట’ జరిగే వేడుక సమయంలో అయుతయాతో పాటు థాయ్‌లాండ్ ఇతర నగరాల్లోని హిందూ దేవాలయాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు బ్యాంకాక్ విశ్వహిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. అన్ని దేవాలయాల్లో దీపాలను వెలిగించనున్నారు.
Read Also: Viral Video : థాయ్ ఎయిర్ ఏషియా బ్యాంకాక్-ఫుకెట్ విమానంలో పాము..వీడియో వైరల్..
థాయ్‌లాండ్ అయోధ్య ఈ ‘అయుత్తయ’
శ్రీరాముడి జన్మస్థలం అయిన అయోధ్య పేరుతోనే అయుత్తయ నగరం ఏర్పడింది. అయుత్తయ మొదటి పాలకుడైన రామతిబోడి రాజు ఈ నగరంపై రామాయణ ప్రభావాన్ని చూపించారు. చక్రి వంశానికి చెందిన రాజులు తమ పేర్లలో రాముడి పేరును చేర్చుకున్నారు. బౌద్ధ మత ప్రచారకులచే రామాయణం ఆగ్నేయాసియాకు పరిచయమైంది. ‘రామకియన్’ పేరుతో థాయ్ భాషలోకి రామాయణాన్ని మార్చారు. థాయ్ సంస్కృతిపై రాముడి జీవిత ప్రభావం ఉందని ప్రపంచ హిందూ ఫౌండేషన్ (డబ్ల్యూహెచ్‌ఎఫ్) వ్యవస్థాపకుడు మరియు గ్లోబల్ చైర్మన్ స్వామి విజ్ఞానంద్ చెప్పారు.
1350లో ఫ్రా నఖోన్ సి అయుతయ నగరం స్థాపించబడింది. ఇది సియామీ రాజ్యానికి రెండో రాజధానిగా ఉంది. దీనిని సియామీ రాజు యుథోంగ్ స్థాపించారు. అతడినే కింగ్ రామ తిబోధిగా పిలిచే వారు. ఈ నగరం 14-18 శతాబ్ధాల మధ్య అభివృద్ధి చెందింది. ఆ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మోపాలిటన్ నగరంగా ఉంది. ప్రపంచ దౌత్యం, వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. అయితే 1767లో బర్మా సైన్యం దాడిలో ఈ నగరం ధ్వంసమైంది. ఇప్పుడు ఈ పట్టణం శిథిలమయంగా మారింది.
థాయ్‌లాండ్ లో భారతీయ ప్రొఫెసర్ సురేష్ పాల్ గిరి ప్రకారం.. 18వ శతాబ్ధంలో బర్మీస్ సైనికులు ఈ నగరాన్ని ఆక్రమించినప్పుడు కొత్త రాజు అధికారాన్ని చేపట్టాడు. అతను తనను తాను రాముడిగా పిలిచుకున్నాడు. ఇప్పుడు బ్యాంకాక్‌గా పిలువబడుతున్న నగరాన్ని ఈయనే స్థాపించాడు. అతను బౌద్దుడైనప్పటకీ రాముడిని ఆదరించారు. రాముడు హిందువులకు లాగే ఆగ్నేయాసియాలో బౌద్దులకు వీరుడు అని చెప్పారు. బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో విష్ణు పురాణంలో వివరించిన “సముద్ర మంథనం” వర్ణించే భారీ శిల్పాలు కూడా ఉన్నాయి.