Telangana: లోక్‌సభ షెడ్యూల్ విడుదలైంది. ఇక పోరు మిగిలింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో ఇకపై తెలంగాణలో పోరు మరింత హీటెక్కనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ పర్యటన తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. మార్చి 15న హైదరాబాద్ ప్రచారానికి అమిత్ షా రాబోతున్నారు. మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ తెలంగాణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పకనే చెప్పారు. 2019 నుంచి 2023కి బీజేపీ తన ఓట్ల శాతాన్ని 14 శాతానికి పెంచుకుంది. ఈ సారి తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లను దక్కించుకోవాలని చూస్తున్నారు. మొత్తం 17 ఎంపీ స్థానాల్లో రెండంకెల కన్నా ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.
Read Also: Petrol Price Reduce: మోడీ సర్కార్ గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు రూ.15 తగ్గింపు.. ఎక్కడంటే?
మరోవైపు అధికార కాంగ్రెస్ కూడా తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ మాత్రం వరస పరిణామాలతో కుదేలవుతోంది. తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతుందా..? అనే అనుమానం కలుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలోని పలువురు నేతలు కాంగ్రెస్, బీజేపీల్లోకి చేరుతున్నారు. ఇలా కీలక నేతలు వేరే పార్టీలకు వెళ్లడం ఆ పార్టీని దెబ్బతీస్తోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత, కేసీఆర్ కుమార్తె కవితని అరెస్ట్ చేయడం పార్టీని నైతికంగా దెబ్బతీసే అవకాశం ఉంది. మే 13న నాలుగో విడతలో భాగంగా తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, సమయం చాలా ఉండటంతో రానున్న రోజుల్లో మరికొన్ని రోజుల్లో ఆ పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండే ప్రమాదం ఉంది.
ఇక బీజేపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల దగ్గర నుంచి తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ కష్టపడితే భవిష్యత్ బీజేపీదే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈసారి 17 సీట్లలో 12కు పైగా సీట్లు సాధించాలని అమిత్ షా టార్గెట్ పెట్టుకున్నారు. ఇక కాంగ్రెస్ 14 సీట్లలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గతేడాది కాంగ్రెస్ విజయం సాధించడంతో ఈసారి ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. బీజేపీ, అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించడం లేదు. బీజేపీ నేతలు కూడా తమ పోటీ కాంగ్రెస్‌తోనే ఉంటుందని చెబుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బిబి పాటిల్ (జహీరాబాద్), పి రాములు (నాగర్‌కర్నూల్) కాషాయ పార్టీలో చేరారు. వలసలో పాటు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి వంటివారు పోటీకి దూరంగా ఉండటం బీఆర్ఎస్‌కి దెబ్బగా మారింది. అయోధ్య రామమందిర నిర్మాణం, మోడీ ఫ్యాక్టర్ తమ విజయానికి దోహదం చేస్తాయని బీజేపీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ తమ సంక్షేమ పథకాలతో పాటు మైనారిటీ ఓట్లు తమ విజయానికి కీలకమవుతాయని చెబుతోంది. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ 09 స్థానాలు, బీజేపీ 04, కాంగ్రెస్ 03, ఎంఐఎం 01 స్థానాల్లో విజయం సాధించింది.