దేశ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ ఏకగ్రీవం తీర్మానం చేసిన విషయం తెలసిందే.. ఇక, ఈ తీర్మానం కాపీని ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అందజేశారు బీఆర్‌ఎస్ నేతలు… తెలంగాణ సీఎం ఇప్పటికే అనేకమార్లు ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్.. ఇప్పుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తారని తెలుస్తోంది.. అంటే బీఆర్‌ఎస్ రూపాంతరం తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకటి, రెండు రోజులలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యే అవకాశం ఉంది.
Read Also: Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ పేరు మార్చేసిన మంత్రి… వైరల్‌గా మారిన వీడియో
ఇక, ఈసారి తన హస్తిన పర్యటనలో.. పలు పార్టీల నేతలతో, రాజకీయ విశ్లేషకులు, మీడియా దిగ్గజాలతో సమాలోచనలు జరపనున్నారట కేసీఆర్… అనారోగ్యంతో ఉన్న సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపన అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ ను పరామర్శించనున్నారు.. అలాగే, ఢిల్లీలోని “బీఆర్ఎస్” తాత్కాలిక కార్యాలయాన్ని కూడా సందర్శించి, తుది రూపునకు కేసీఆర్ సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సీఎం కేసీఆర్ దూరం అవ్వొచ్చన్న అనుమానాలు ఉండేవి. అయితే.. ఇప్పుడు అలాంటి అనుమానాలు ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే.. తాను తెలంగాణకు సీఎంగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తానని, అందులో ఎవ్వరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదని స్వయంగా కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే..
అంతేకాదు.. ఏపని చేసినా అర్థవంతంగా, ప్రకాశవంతంగా చేయాలన్న కేసీఆర్.. తెలంగాణను సాధించుకున్న అనతికాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగునీరు వంటి సమస్త రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతున్నామన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని ఏలిన పార్టీలు కేవలం గద్దెనెక్కడం, గద్దెదిగడం తప్ప.. దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక ఆట వంటిది.. కానీ, టీఆర్ఎస్‌కి అదొక టాస్క్ అని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉండేదని.. కానీ ఇప్పుడు 2 లక్షల 78 వేల రూపాయలకు పెరిగిందన్నారు. అలాగే.. 2014లో జీఎస్డీపీ 5 లక్షల 6 వేలుంటే, నేడు 11 లక్షల 50 వేలకు చేరుకున్నదన్నారు. ఎలాగైతే కష్టపడి తెలంగాణని అభివృద్ధి ప్రగతిలో నడిపించామో.. అలాగే దేశం కోసం కష్టపడి, అభివృద్ధిని సాధించి చూపిద్దామని పిలుపునిచ్చారు. మరోవైపు.. బీఆర్‌ఎస్ ప్రకటనకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. ఇతర రాష్ట్రాల నేతలు హాజరయ్యారు.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరు కావాల్సి ఉన్నా.. ఆయన తండ్రి అయిన ములాయం సింగ్ యాదవ్ అనారోగ్య సమస్యలతో ఐసీయూలో ఉన్న కారణంగా తానే రవొద్దని చెప్పానని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే.. అఖిలేష్‌కు ఫోన్ చేసిన కేసీఆర్.. ములాయం సింగ్ ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీసి.. దసరా తర్వాత నేనే వస్తానని చెప్పిన విషయం విదితమే.