Student Suicide: రాజస్థాన్ కోటాలో మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలోనే ఉరేసుకుని మరణించింది. తక్కువ మార్కులు వస్తున్నాయన్న మనస్తాపంలోనే తమ కుమార్తె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ కు చెందిన షెంబుల్ పర్వీన్ మెడికల్ ఎంట్రెన్స్ లో కోచింగ్ తీసుకునేందుకు ఏడాది క్రితం కోటాలోని ఓ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. మంగళవారం యువతి తల్లిదండ్రులు ఆమెకు వేరే చోట వసతి వెతుకుతున్న సమయంలోనే షెంబుల్ ఆత్మహత్య చేసుకుంది.
Read Also: Boy Fell In Borewell: రెస్క్యూ ప్రయత్నాలు విఫలం.. బోరుబావిలో పడిన పిల్లాడి మృతి
పరీక్షల్లో తక్కువ స్కోర్లు రావడంతో పాటు తన హాస్టల్‌లోని ఆహారం గురించి ఆమె మనస్తాపంతో ఉండేదని తల్లిదండ్రులు ఆరోపించారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయంటే వచ్చే ఏడాది చూసుకోవచ్చని నేను ఎప్పుడూ కూతురుకు చెబుతుండే వాడిననని ఆమె తండ్రి కన్నీరుమున్నీరు అవుతున్నారు. దీంతో పాటు హాస్టల్ లో ఫుడ్ బాగుండటం లేదని తన కూతురు తరుచూ చెబుతుండేదని, అందుకే వేరే చోట వసతి వెతుకుతున్నామని అన్నారు. ఇలా వెతుకుతున్న సమయంలోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు.
మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కోచింగ్ కు రాజస్థాన్ కోటా కేంద్రంగా ఉంది. అయితే ఇలా కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి విద్యార్థినులు తీవ్ర ఒత్తడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే మార్కులు, ఇతర ఒత్తడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంతకుముందు రోజు ఐఐటీ మద్రాస్ లో మూడో ఏడాది బీటెక్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన పుష్పక శ్రీసాయి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24 గంటల్లోనే ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోయారు.