గత కొన్ని రోజులుగా ఉత్తర్ ప్రదేశ్ లో మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఇటీవల కాన్పూర్ లో హింస చెలరేగింది. కొంతమంది రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో 40 మంది వరకు గాయపడ్డారు. ప్రస్తుతం కాన్పూర్ లో అల్లర్లు తగ్గుముఖం పట్టాయి. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యూపీలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే బీజేేపీ పార్టీ నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్ ను సస్పెండ్ చేసినా.. ఆందోళనలు సద్దుమణగడం లేదు.
తాజాగా ఈ రోజు శుక్రవారం ప్రార్థనల అనంతరం యూపీలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు ఆందోళనలు, నిరసనలు చేశారు. సహరాన్‌పూర్, మొరాదాబాద్, రాంపూర్, లక్నోలలో పలు ప్రాంతాల్లో ప్రార్థనల అనంతరం భారీ సంఖ్యలో ప్రజలు ఆందోళన చేశారు. ప్రయాగ్ రాజ్ అటాలా ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వారు. దీంతో పెద్ద ఎత్తున బలగాలు ఆ ప్రాంతంలో మోహరించాయి.
తాజాగా ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. ఆందోళనలు, హింసకు పాల్పడుతున్నావారికి వార్నింగ్ ఇచ్చారు. రాళ్లదాడికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ పోలీసులను ఆదేశించారు. ప్రస్తుతం ఏసీఎస్ హోమ్ అవనీష్ అవస్థి, యాక్టింగ్ డీజీపీ, ఏడీజీ లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించి హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తన మోహరించారు.
మరోవైపు జార్ఖండ్ రాజధాని రాంచీలో కూడా ఆందోళలు హింసాత్మక ఘటనలుగా మారాయి. ప్రార్థన అనంతరం భారీగా రోడ్లపైకి వచ్చి విధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టడంతో పాటు రాళ్లు రువ్వారు. ప్రస్తుతం పరిస్థితి కొద్దిగా ఉద్రిక్తంగా ఉన్నా కంట్రోల్ లోకి వచ్చిందని రాంచీ డీఐజీ అనిష్ గుప్తా తెలిపారు.