Suvendu Adhikari comments on TMC government: బీజేపీ నేత సువేందు అధికారి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరు నెలులు కూడా బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండదని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. అధికార టీఎంసీ ‘ కొత్త, సంస్కరించిన టీఎంసీ’ ఆరు నెలల్లో వస్తుందని పోస్టర్ల ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో సీఎం మమతా బెనర్జీ సర్కార్ పడిపోతుందని జోస్యం చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణ చేస్తున్నాయని.. టీఎంసీ పార్టీ అధికారం ఆరు నెలలు కూడా ఉండదని.. డిసెంబర్ నెల వారికి చివరి గడువు అంటూ పూర్బా మేదిని పూర్ లో సువేందు అధికారి అన్నారు. ఇటీవల మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సంబంధం ఉన్నవారు వరసగా కేసుల్లో ఇరుక్కుంటుండటంపై ఆయన ప్రస్తావించారు.
Read Also: Swine Flu in Telangana: తెలంగాణపై స్వైన్ ఫ్లూ పంజా విసరబోతోందా?
ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు అనుబ్రత మోండల్ ని ఆగస్టు 20 వరకు సీబీఐ కస్టడీకి పంపారు.. అక్రమంగా పశువుల రవాణా స్కామ్ లో ఈయన్ను సీబీఐ అరెస్ట్ చేసింది. మరో వైపు ఇప్పటికే స్కూల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనకు అత్యంత సన్నిహితురాలు అయిన అర్పితా ముఖర్జీ ప్లాట్ లో పార్థ ఛటర్జీకి సంబంధించిన భారీ నగదును ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఆభరణాలతో పాటు రూ. 50కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది.
బెంగాల్ లో వరస పరిణామాలు, ముఖ్యమైన నేతలు పలు స్కాముల్లో ఇరుక్కుంటుండటంతో బీజేపీ పార్టీ నాయకులు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. త్వరలోనే మమతా సర్కార్ కూలిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం టీఎంసీ నాయకులు కూడా బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఏకంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రే అరెస్ట్ కావడంతో టీఎంసీ డైలామాలో పడింది.