Supreme Court To Hear Plea on marital rape: వివాహ అనంతరం భార్య అనుమతి లేకుండా బలవంతంగా శృంగారం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఇంతకుముందు ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం విరుద్ధమైన తీర్పులు ఇవ్వడంతో సమస్య ఏర్పడింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. కాగా ఈ కేసును సెప్టెంబర్ 16న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
మే 11న ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసంలో జస్టిస్ రాజీవ్ శక్ధర్, జస్టిస్ హరి శంకర్ ఈ కేసుపై విభిన్న అభిప్రాయాలు ప్రకటించారు. ఢిల్లీ హైకోర్టు విచారించిన ఈ కేసుపై దాఖలైన రెండు పిటిషన్లు శుక్రవారం సుప్రీంకోర్టులోని జస్టిస్ అజయ్ రస్తోగి, బీవీ నాగరత్న ధర్మాసనం ముందుకు వచ్చాయి. హైకోర్టులోని డివిజన్ బెంచ్ లోని ఇద్దరు న్యాయమూర్తులు ఈ కేసును సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అనుమతి మంజూరు చేసినట్లు పిటిషన్ తరుపున న్యాయవాది అత్యున్నత కోర్టుకు వెల్లడించారు.
Read Also: Etela Rajender: ఇదంతా సీఎం కేసీఆర్ స్కెచ్.. ఇదో పిరికి చర్య
గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జస్టిస్ రాజీవ్ శక్ధర్, జస్టిస్ హరిసింగ్ పరస్పర భిన్నాభిప్రాయాలను వెలువరించారు. జస్టిస్ రాజీవ్ శక్ధర్ వైవాహిక అత్యాచారం కేసుల్లో భర్తలకు మినహాయింపును ఇవ్వడాన్ని కొట్టివేయడానికి మొగ్గు చూపారు. భారతీయ శిక్షాస్మృతి అమలులోకి వచ్చిన 162 ఏళ్ల తరువాత కూడా న్యాయం కోసం అభ్యర్థిస్తున్న ఓ మహిళ పిలుపు వినబడకపోతే అది విషాదకరమని వ్యాఖ్యానించారు. మరోక న్యాయమూర్తి జస్టిస్ సి. హరి శంకర్ అత్యాచార చట్టాల్లో భార్యభర్తలకు మినహాయింపులు రాజ్యాంగ విరుద్ధం కాదని అన్నారు.
ఐపీసీ సెక్షన్ 375(రేప్) కింద వైవాహిక అత్యాచారం మినహాయింపుపై రాజ్యాంగబద్ధతను పిటిషనర్లు సవాల్ చేశారు. వివాహిత తన భర్త చేతిలో అత్యాచారానికి గురైతే ఇది వివాహిత మహిళల పట్ల వివక్ష చూపుతుందని పిటిషన్లు వాదించారు. అయితే సెక్షన్ 375లో మినహాయింపు ప్రకారం.. ఒక వ్యక్తి తన భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చు.. ఒక వేళ భార్య మైనర్ కాకపోతే ఇది అత్యాచారం కాదని ఉంది. కాగా.. భారతీయ అత్యాచార చట్టం కింద భర్తలకు ఇచ్చిన మినహాయింపులను కొట్టి వేయాలని కోరుతూ.. ఆర్ఐటీ ఫౌండేషన్, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్ తో పాటు మరో ఇద్దరు పిటిషన్లు దాఖలు చేశారు.