Etela Rajender Reacts On Assam CM Himantha Biswa Sarma Incident: గణేశ్ నిమజ్జనం ఉత్సవ కమిటీలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేత నందుబిలాల్ అడ్డుకున్న ఘటనను బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. ఇదంతా సీఎం కేసీఆర్ కుట్రేనని ఆరోపించారు. ఇతర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని అవమానపరిచిన బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీన్నొక పిరికి చర్యగా అభివర్ణించిన ఆయన.. ప్రజల విశ్వాసం ఉన్న వాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడరని అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే ఇలాంటి దాడులకు దిగుతారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి పోయేకాలం వచ్చిందని, అందుకే గణేష్ నిమజ్జనం ఉత్సవాల సమయంలో ఇటువంటి పని చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని.. ఎవరు, ఏం చేస్తున్నారో అంత గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇటువంటి చర్యల్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారని తాను భావిస్తున్నానని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
చిల్లర మాటలు మాట్లాడటంలో సీఎం కేసీఆర్‌ని మించిన వారెవరూ లేరని ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యల్ని వినలేదని, అయితే ఆయన కేసీఆర్‌లాగా సంస్కారహీనంగా మాట్లాడి ఉండరని తెలిపారు. బాధ్యత మరిచి ఎవరూ వ్యవహరించరని తాను భావిస్తున్నానన్నారు. పోలీసుల పర్యవేక్షణలోనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఈటెల విమర్శించారు. పోలీసుల సహకారం లేనిదే, ఇలాంటివి సాధ్యం కాదని ఆరోపణలు చేశారు. మన తెలంగాణలో పోలీస్ వ్యవస్థ గొప్పగా ఉందని వాళ్లే చెప్పుకుంటున్నారని, పోలీసుల వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగిందని తాను చెప్పడం లేదని, కాకపోతే ప్రభుత్వమే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ చర్యకి పాల్పడి ఉంటుందని తాను భావిస్తున్నానన్నారు. దీనిపై కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
ఇదే సమయంలో తమిళిసై వ్యాఖ్యలపై స్పందిస్తూ.. గత రెండున్నరేళ్ల నుంచి కేసీఆర్ అవమానిస్తుండడం వల్లే ఆమె అలా వ్యాఖ్యానించారని అన్నారు. అయితే.. గవర్నరే తన చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. 2023 వరకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అపహాస్యం చేయకుండా ఉండాలని కేసీఆర్‌కు సూచించారు. ఈసారి ఎన్నకల్లో కేసీఆర్ ఓటమి తథ్యమని, ఆయనకు మంచి జరిగే ఆస్కారమైతే లేదని ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు.