Supreme Court: ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని, రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లను ఉపయోగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. న్యాయవాది సీఆర్ జయ సుకిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఆగస్టు 3, 2021 నాటి ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్ సీఆర్ జయ సుకిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
రాబోయే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) వినియోగాన్ని నిలిపివేయాలని , బ్యాలెట్ పేపర్‌లను వాడాలని సీఆర్ జయ సుకిన్ పిటిషన్‌లో కోరారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి దేశంలోని ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) భారతదేశంలో పాత బ్యాలెట్ పేపర్ వ్యవస్థను భర్తీ చేశాయి. అయినప్పటికీ ప్రపంచంలోని అనేక దేశాలు; ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఈవీఎంల వినియోగాన్ని నిషేధించాయి” అని పిటిషనర్ ఢిల్లీ హైకోర్టులో తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Jharkhand Political Crisis: విశ్వాస పరీక్ష నెగ్గిన సోరెన్ సర్కారు.. ప్రతిపక్ష బీజేపీ వాకౌట్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలు స్వేచ్ఛగా,నిష్పక్షపాతంగా జరగాలని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులు దేశం అంతటా తప్పనిసరిగా బ్యాలెట్ పేపర్‌లనే వాడేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అమెరికా, జపాన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల సమయంలో ఈవీఎంలను తిరస్కరించి, బ్యాలెట్ విధానాన్ని ఎంచుకున్నాయని న్యాయవాది తన పిటిషన్‌లో పేర్కొన్నారు. “ఈవీఎంలు దేశ ఎన్నికల ప్రక్రియ కోసం ఉపయోగించేందుకు సంతృప్తికరమైన సాధనాలు కాదు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు. అయితే బ్యాలెట్ విధానం చాలా సురక్షితం” అని పిటిషనర్ చెప్పారు.