అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్యక్తం చేసింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం కూలిపోయింది. దాదాపు 271 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ప్రమాదంపై రెండు సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
ఇది కూడా చదవండి: Shehbaz Sharif: నేటినుంచి 5 రోజులు అమెరికాలో పాక్ ప్రధాని పర్యటన.. ట్రంప్‌ను కలవనున్న షెహబాజ్ షరీఫ్
ఒక దర్యాప్తు సంస్థ 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. ఇందులో టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత ఒకదాని తర్వాత ఒకటి.. రెండు ఇంజిన్ ఇంధన స్విచ్‌లు ఆపివేయబడ్డాయని తెలిపింది. అయితే కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరొక పైలట్‌ను ‘‘నువ్వు ఎందుకు కట్ చేశావు?’’ అని అడుగుతున్నట్లు రికార్డైంది. మరొక పైలట్ ‘‘నేను చేయలేదు’’ అని ప్రతి స్పందించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ చివరి చూపు కోసం లక్షలాదిగా తరలివచ్చిన అస్సామీయులు.. 25 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్
ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాఖ్యం(పీఐఎల్) దాఖలైంది. సోమవారం ఈ పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారించింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా పైలట్లను నిందించడం బాధ్యతారాహిత్యం అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘‘ప్రాథమిక రిపోర్టును పట్టుకుని పైలట్లు తప్పు చేశారని నిందిస్తే.. ఆ కుటుంబాలు ఎంత బాధపడతాయి.. ఫైనల్ రిపోర్టు రావడానికి సమయం ఉంది కదా? తుది నివేదికలో ఏ తప్పు లేదని తేలితే ఏం జరుగుతుంది?’’. అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ‘‘దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అలాంటి విషాదాలు జరిగినప్పుడు.. ప్రత్యర్థి విమాన కంపెనీలు ప్రయోజనం పొందుతాయి.’’ అని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పారదర్శకంగా, న్యాయంగా, వేగవంతమైన దర్యాప్తుపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం నోటీసు జారీ చేసింది. ఫైనల్ నివేదిక వచ్చేంత వరకు ఎవరిని నిందించడం గానీ.. పుకార్లు సృష్టించడం గానీ.. తప్పుగా ప్రొజెక్ట్ చేయడం గానీ చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది.
ప్రాథమిక రిపోర్టు రాగానే పైలట్ ఆత్మహత్య కారణంగానే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం చేశాయి. దీంతో పైలట్ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. తుది నివేదిక రాకుండా ఎలా ప్రసారం చేస్తారంటూ నిలదీశారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం లండన్‌కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. హాస్టల్లో మెడికోలు కూడా చనిపోయారు. ఇలా మొత్తం 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిరిండియా రూ.కోటి పరిహారం అందించింది.