CJI BR Gavai: ఖజురహోలోని విష్ణు విగ్రహానికి సంబంధించిన పిటిషన్ను విచారిస్తున్న సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి. ఖజురహోలోని పురాతన విష్ణువు విగ్రహం ధ్వంసం చేయబడిందని, దీనిని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ, సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయబడింది. ఖజురహోలో ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలపై పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Read Also: Little Hearts : ఆ విషయంలో మౌళిని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సిందే..
విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ‘‘మీరు మిమ్మల్ని విష్ణువు ఆరాధకుడిగా పిలుచుకుంటే, కొంచెం ప్రార్థన చేసి ధ్యానం చేయండి. వెళ్లి భగవంతుడినే దీనిపై చర్యలు తీసుకోమని అడగండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఖజురహో ఒక పురావస్తు ప్రదేశం, ఇది భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) కిందకు వస్తుందని, వారి అనుమతి లేకుండా దీనిలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు క్షమించండి’’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సీజేఐకి ఒక న్యాయవాది బహిరంగ లేఖ రాశారు. గవాయ్ చేసిన వ్యాఖ్యల్ని పున: పరిశీలించాలని లేదా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది సత్యం సింగ్ రాజ్పుత్ సీజేఐ చేసిన వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. వినీత్ జిందాల్ అనే మరో న్యాయవాది రాష్ట్రపతికి ఈ విషయంపై లేఖ రాశారు. సుప్రీంకోర్టు భారతదేశంలోని ప్రతీ విశ్వాసాన్ని గౌరవించాలని కోరారు. శ్రీ విష్ణువు, హిందూ భావాలకు వ్యతిరేకంగా చేసిన ఈ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని కోరారు.