Supreme Court: గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ శనివారం రాత్రి హత్యకు గురయ్యారు. పోలీస్ కస్టడీలో వైద్యపరీక్షల నిమిత్తం వచ్చిన ఇద్దరిని ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టులుగా నటిస్తూ అతిదగ్గర నుంచి కాల్చి చంపారు. ఈ హత్య ఉత్తర్ ప్రదేశ్ తో పాటు యావత్ దేశంలో చర్చనీయాంశం అయింది. ప్రతిపక్షాలు సీఎం యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టాయి. యూపీ ఎన్కౌంటర్ రాజ్ గా మారిందని సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ వంటి పార్టీలు బీజేపీని విమర్శించాయి.
ఈ ఘటనపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 24న దీనిపై విచారణ చేసేందుకు అంగీకరించింది.
Read Also: NIA: భారత హైకమిషన్‌పై ఖలిస్తాన్ వేర్పాటువాదుల దాడి.. ఎన్ఐఏ విచారణ
రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిటీతో దర్యాప్తు చేయాలని కోరుతూ, 2017 నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై కమిటీ విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీ కూడా కోరారు. ఇదే కాకుండా గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌పై కూడా సీబీఐ చేత దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ కోరారు. ఈ హత్యకేసును సీబీఐకి బదిలీ చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ పిటిషన్ దాఖలు చేశారు.