NIA Probe Begins Into Attack On Indian Mission In London: ఖలిస్తానీ వేర్పాటువాదులు భారతదేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించిన సమయంలో ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో పలువరు ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారత రాయబార కార్యాలయను టార్గెట్ చేశారు. ముఖ్యంగా లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు భారత వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. ఏకంగా హైకమిషన్ ముందున్న భారత జెండాను తొలగించి, ఖలిస్తాన్ జెండాను పెట్టేందుకు ప్రయత్నించారు.
ఈ చర్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ రాడికలైజేషన్ (CTCR) విభాగం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది. కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఎఫ్ఐఆర్) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
Read Also: Ileana: ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన గోవా బ్యూటీ…
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నుంచి ఎన్ఐఏ కేసును స్వీకరించింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తోంది. గత వారం యూకే ప్రతినిధులతో భారత హోం మంత్రిత్వశాఖ అధికారులు సమావేశం అయ్యారు. దీని తర్వాత ఈ కేసును హోంమంత్రిత్వ శాఖ ఎన్ఐఏకి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారితో సహా ప్రత్యేక టీం త్వరలోనే లండన్ సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మార్చి 19న ఖలిస్తాన్ జెండాడలను పట్టుకుని, ఖలిస్తాన్ అనుకూల, భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ లండన్‌లోని భారత హైకమిషన్ పైన ఎగురుతున్న జాతీయ జెండాను కిందకి లాగారు. ఈ నిరసనలను అక్కడే ఉన్న బ్రిటన్ పోలీసులు అడ్డుకోలేదు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య అనంతరం ఢిల్లీలోని యూకే రాయబార కార్యాలయం వద్ద బారికేడ్లు, సెక్యూరిటీని ఉపసంహరించి తన నిరసనను తెలియజేసింది. గత బుధవారం జరిగిన ఐదవ ఇండియా-యుకె హోం వ్యవహారాల డైలాగ్‌లో, ఖలిస్తాన్ మద్దతుదారులు యూకే శరణార్థి ఆశ్రయం హోదాను దుర్వినియోగం చేయడంపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది.