Supreme court Acceptance of Trial on Talaq-e-Hasan Divorce: ఏకపక్ష చట్టవిరుద్ధమైన విడాకులు, తలాక్-ఎ-హసన్ వంటి విడాకులు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. తలాక్-ఎ-హసన్ అనేది ఇస్లాంలో విడాకులకు ఓ రూపం. దీని ద్వారా పెళ్లయిన పురుషుడు తన భార్యకు ప్రతీ నెల ‘తలాక్’ పదాన్ని చెప్పడం ద్వారా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు.
అయితే ఈ కేసుపై నమోదైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ ఎస్ కే కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రం, జాతీయ మహిళా కమిషన్, జాతీయ హక్కుల కమిషన్ తమ స్పందనను నాలుగు వారాల్లో తెలియజేయాలని కోరింది. ఈ కేసును జనవరి మూడో వారంలో విచారించనున్నట్లు జస్టిస్ ఎస్కే కౌల్, అభయ్ ఎస్ ఓకా, విక్రమ్ నాథ్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఘజియాబాద్ కు చెందిన బెనజీర్ హీనా దాఖలు చేసిన పిటిషన్ తో పాటు మూడు వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది.
తలాక్-ఎ-హసన్ ప్రకారం మూడు నెలల కాలంలో భార్యభర్తలు సహజీవనం చేయకుండా వరసగా నెలకోసారి తలాక్ చెప్పితే విడాకులు పొందినట్లు. అయితే మొదటి, రెండోసారి తలాక్ చెప్పిన తర్వాత భార్యభర్తలు ఇద్దరు మళ్లీ సహజీవనం చేస్తే ఇద్దరు రాజీ పడినట్లు భావించబడుతుంది.
Read Also: Rashmika: ఎఫైర్ బయటపెట్టడానికే వాటిని చూపిస్తుందా..?
అంతకుముందు సోమవారం ‘ తలాక్-ఎ-కినయా’, తలాక్-ఎ-బైన్’ సహా ముస్లింలలో ఉన్న అన్నిరకాల ఏకపక్ష, చట్టవిరుద్ధమైన విడాకులు చెల్లవని.. రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కర్ణాటకకు చెందిన ఓ మహిళ ‘ తలాక్-ఎ-కినయా’ ఆచారాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రకమైన ఆచారాన్ని స్థానిక ఖాజీలు సృష్టించి అమలు చేస్తున్నందు వల్ల దీన్ని చట్టవిరుద్ధమైందిగా ప్రకటించాలని.. ముస్లిం మహిళల హక్కులు ఉల్లంఘించాలనే వాదనను ఈ పిటిషన్ లేవనెత్తింది.
న్యాయమూర్తులు అబ్దుల్ నజీర్, జస్టిస్ జేబీ పార్థివాలాలతో కూడిన ధర్మారసం ఈ పిటిషన్ స్పందించాలని కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖలతో పాటు జాతీయ మహిళా కమిషన్, జాతీయ హక్కుల కమిషన్ తమ స్పందన తెలియజేయాలని నోటీసులు జారీచేసింది.