PM Narendra Modi: భారతదేశ ప్రజాస్వామ్య విజయం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొంతమందిని బాధిస్తోందని, అందుకు వారు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ శనివారం అన్నారు. ఇటీవల ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశం ఆత్మ విశ్వాసం, సంకల్పంతో ముందుకు వెళ్తూ, ప్రపంచంలోని మేధావులు భారత్ పట్ల ఆశాజనకంగా ఉండే సమయంలో కొందరు నిరాశవాదం, దేశాన్ని తక్కువ చేసేలా, దేశ నైతికత దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఆయన ఇండియా టుడే కాంక్లేవ్‌లో అన్నారు.
ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ‘కాలా టిక’ (కాలుకతో దిష్టితీయడం) వంటి సంప్రదాయం ఉందని, అందుకే ఇన్ని శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కొందరు ఈ ‘ కాలాటిక’ బాధ్యతను తీసుకున్నారని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. భారత ప్రజాస్వామ్య విజయం కొందరిని బాధపెడుతున్నాయని, ఎలాంటి దాడులు జరిగినా దేశం తన లక్ష్యాలను చేరుకునేలా ముందుకు సాగుతుందనే నమ్మకం తనకు ఉందని ప్రధాని అన్నారు.
Read Also: Natu Natu Song: ’నాటు నాటు‘ సాంగ్ పై హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్
ఇంతకుముందు కుంభకోణాలు ముఖ్యాంశాలుగా ఉండేవని, అయితే ఇప్పుడు వారిపై చర్యలు తీసుకుంటున్నందకు అవినీతిపరులు చేతులు కలిపారని అన్నారు. ఈ సమయం భారతదేశానిదే అని ప్రపంచం చెబుతోందని, దేశంలో ప్రభుత్వ పనితీరు మారడం వల్లే ఇది సాధ్యమైందని ప్రధాని వెల్లడించారు. ప్రభుత్వాలు వారి వారి సామర్థ్యాలకు అనుగుణంగా పనిచేశాయని, దాని ప్రకారమే ఫలితాలు సాధించాయని అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, దేశం స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగదారులలో మొదటి స్థానంలో ఉంది, రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారు, మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కలిగి ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నా.. భారత బ్యాంకింగ్ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉందని అన్నారు.
ఇటీవల లండన్ పర్యటకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని, వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేస్తున్నారని, న్యాయవ్యవస్థ, మీడియా అణిచివేత కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.