దేశంలో ‘అగ్నిపథ్’ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేంద్రం తీసుకువచ్చిన కొత్త ఆర్మీ రిక్రూట్ మెంట్ స్కీమ్ పై ఆర్మీ ఆశావహుల నుంచి తీవ్ర స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. బీహార్ రాష్ట్రంలో ప్రారంభం అయిన ఆగ్రహ జ్వాలలు మెల్లిగా దేశం మొత్తం పాకుతున్నాయి. ఇప్పటికే హర్యానా, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కేవలం నాలుగేళ్ల కాలపరిమితితో ఈ అగ్నిపథ్ స్కీమ్ రావడంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళనకు, ఆగ్రహానికి గురవుతున్నారు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు రేపు జూన్ 18 తేదీన ‘భారత్ బంద్’ కు పిలుపునిచ్చారు. బీహార్లో ఆందోళన చేస్తున్న యువకులు ఈ బంద్ కు పిలుపునిచ్చారు. దీనికి ఆర్జేడీ బంద్ కు మద్దతు ప్రకటించింది. ఇతర ప్రతిపక్షాలు కూడా మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ముఖ్యంగా రైల్వేను టార్గెట్ చేస్తున్నారు. నిన్న బీహార్ లో పలు ప్రాంతాల్లో రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. పలు రైళ్లకు నిప్పుపెట్టారు. రైల్వే ట్రాకులపై మంటలు పెట్టి నిరసన తెలిపారు. తాజాగా ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కూడా ఇదే విధంగా నిరసనలు రిపీట్ అయ్యాయి. పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. మరింతగా అల్లర్లు చెలరేగకుండా హర్యానా వ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ చేశారు.
అగ్నిపథ్ స్కీమ్ పై విపక్షాలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. బీజేపీ ఆర్మీని కూడా ప్రైవేట్ చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ అగ్నిపథ్ పథకాన్ని యువత తిరస్కరిస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీని నిందిస్తూ ట్వీట్స్ చేశారు. మరోవైపు ఎన్డీయేతర ప్రతిపక్షాలు కూడా బీజేపీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. తిరిగి గతంలో ఉన్న రిక్రూట్మెంట్ వ్యవస్థనే తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.