Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువతి నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న పథకం యొక్క ప్రయోజనాలు పొందేందుకు ఏకంగా భర్తనే మార్చేసింది. తనను పెళ్లి చేసుకోవాల్సిన వరుడు రాకపోవడంతో ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం ప్రయోజనాలను పొందేందుకు సదరు మహిళ తన బంధువుల అబ్బాయితో వివాహ లాంఛనాలను పూర్తి చేసింది. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ ప్రారంభించారు. ఝాన్సీలో మంగళవారం 132 జంటలకు జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: IAS Transfers: తెలంగాణలో పలువురు ఐఏఎస్ బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వరుడు వృష్భన్ సరైన సమయానికి రాకపోవడంతో ఖుషీ అనే యువతి తన బంధువుల్లో వేరే అబ్బాయిని వివాహ తంతును పూర్తి చేసింది. యూపీలో సీఎం సామూహిక వివాహ పథకం కింద పెళ్లైన జంటకు రూ. 51,000లను ప్రభుత్వం అందిస్తోంది. వధువు ఖాతాలో రూ. 35,000 జమ చేయడంతో పాటు బహుమతుల కోసం కరూ. 10,000, వేడుక ఏర్పాట్లకు రూ. 6,000లను ఇస్తోంది.
తాజా ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లలితా యాదవ్ తెలిపారు. ఈ పథకం కింద పెళ్లిళ్లు జరిగే ముందు ఆధార్ కార్డులు సరిపోల్చడం, ఇతర వివరాలను సరిచూసుకోవడం జరుగుతోంది. అయితే, ఈ విషయంలో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఖుషీకి ఇచ్చిన అన్ని బహుమతులు, ఇతర సామాగ్రిని వెనక్కి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.