Law Commission: గత కొంత కాలంగా దేశద్రోహ చట్టం(sedition) చట్టం తొలగింపు, అమలుపై కీలక చర్చ జరుగుతోంది. దేహ్రద్రోహ చట్టం దుర్వినియోగం అవుతోందని పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ నుంచి కేరళ, పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశ భద్రత, సమగ్రతను రక్షించేందుకు దేశద్రోహ చట్టం కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు.
దేశద్రోహ చట్టాన్ని పునరుద్ధరించాలని ఇటీవల లా కమిషన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. దీన్ని జస్టిస్ రితురాజ్ అవస్థి సమర్థించారు. అయితే ఈ చట్టం దుర్వినియోగం కాకుండా పలు రక్షణలు తీసుకోవాలని ఆయన కోరారు. గతేడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఉపసంహరణలో ఉన్న చట్టాన్ని నిలుపుదల చేయాలని ప్యానెల్ సిఫారసు చేసింది.
Read Also: Mamata Banerjee: బీజేపీ అధికారంలో ఉండేది మరో 6 నెలలే.. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు..
దేశ భద్రత చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(UAPA) వంటి చట్టాలు ఉన్నప్పటికీ.. భిన్న పరిస్థితుల దృష్ట్యా దేశద్రోహ చట్టం కూడా అవసరమని అన్నారు. వలసవాద చట్టం అని దీన్ని తొలగించడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీతో సహా అనేక దేశాలు ఏదో రూపంలో ఇలాంటి సొంత చట్టాలను కలిగి ఉన్నాయని ఆయన అన్నారు.
గత నెలలో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో, జస్టిస్ అవస్థి నేతృత్వంలోని 22వ లా కమిషన్, భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 124A దుర్వినియోగాన్ని నిరోధించడానికి భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు దీన్ని కొనసాగించాలని సిఫారసు చేసింది. అయితే వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉన్నందున అధికార పార్టీ వ్యతిరేకంగా ఉన్న గొంతుల్ని అణిచివేయడానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం దోశద్రోహ చట్టం ప్రకారం మూడేళ్లు జైలు శిక్ష, జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో జీవితఖైదు కూడా పడే అవకాశం ఉంటుంది. జరిమానాతో లేదా లేకుండా మూడేళ్ల వరకు ఉన్న ఈ శిక్షను జరిమానాతో లేదా లేకుండా ఏడేళ్లకు పెంచవచ్చు సిఫారసు చేశామని అవస్థి వివరించారు.