గోవాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అక్కడి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి దిగంబర్ కామత్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ ఉన్నారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో కాంగ్రెస్ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని, తమ పార్టీలో చేరితో రూ. 50 కోట్లు ఇస్తామంటూ కాషాయ పార్టీ కాంగ్రెస్ నేతలకు ఆఫర్ చేసిందని ఆయన ఆరోపించారు. కేవలం ఒక్క గోవాలోనే కాదు.. ప్రతీ రాష్ట్రంలోనూ ‘ఆపరేషన్ కమల్’ పేరుతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారని.. కానీ కర్ణాటక రాష్ట్రంలో అలా సాధ్యపడదని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
ఇదే సమయంలో మరో కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్ కూడా బీజేపీని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని చెప్పిన ఆయన.. కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇంకా బీజేపీ, జేడీఎస్ నేతలే కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. బీజేపీలో చేరితే రూ.50 కోట్లు ఇస్తామని ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం నిజంగా సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి గోవాలో ఎన్డీయే సర్కార్ బలం 30కి చేరుకుంటుందని, బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు చేరుతారని గత నెలలో కర్ణాటక బీజేపీ నేత సీటీ రవి జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి చేరుతున్నారని వార్తలు జోరందుకున్నాయి. ప్రస్తుతం గోవాలో ఎన్డీయేకు 25 సీట్లుండగా.. యూపీఏకు 12 సీట్లున్నాయి. మరి, ఆయన జోస్యం చెప్పినట్టు బీజేపీ సంఖ్య 30కి చేరుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.