Sanjay Raut comments on Karnataka-Maharashtra border dispute: కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చరాజేస్తోంది. బెలగావి ఈ మొత్తం సమస్యకు కేంద్రం అవుతోంది. గత కొన్ని దశాబ్ధాలుగా కర్ణాటకలోని బెలగావి తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ వివాదంపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోకి చైనా ప్రవేశించినట్లే.. కర్ణాటకలోకి మేం అడుగుపెడతాం అంటూ సరికొత్త వివాదానికి తెర లేపారు. ఈ విషయంలో ఎవరి అనుమతి అవసరం లేదని అన్నారు.
చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం కానీ కర్ణాటక సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్రలో బలహీనమైన ప్రభుత్వం ఉందని.. ఈ సమస్యపై ఎలాంటి స్టాండ్ తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎన్సీపీ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాడు. మహారాష్ట్ర ననుంచి ఓ లోక్ సభ నాయకుడిని బెలగావి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ.. తొలిసారిగా సరిహద్దు వివాదంపై కేంద్ర హోం శాఖ మంత్రి మధ్యవర్తిత్వం వహించారని.. ఈ సమస్ను పరిష్కరిస్తారని అన్నారు. సరిహద్దు సమస్యను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఉపముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్ అన్నారు.
Read Also: Andhra Pradesh: కేంద్రం కీలక ప్రకటన.. రూ.106 కోట్లతో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు
ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు సమస్య చిచ్చురేపుతోంది. ఇటీవల కర్ణాటక బస్సులపై మహారాష్ట్రలో దాడి జరిగింది. ఇదే విధంగా కర్ణాటకలో కూడా మహారాష్ట్ర వాహనాలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
1956లో రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య అలాగే ఉంది. కర్ణాటకలోని బెళగావిని మహారాష్ట్ర తమదే అని చెబుతుంటే.. మహారాష్ట్రలోని షోలాపూర్ తమదే అని కర్ణాటక చెబుతోంది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తర్వాత బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెలగావి కర్ణాటకలో చేరింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై వివాదం చెలరేగుతూనే ఉంది. మరోవైపు కర్ణాటక మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చాలని కర్ణాటక డిమాండ్ చేస్తోంది.