Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి సంచలనంగా మారింది. ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. మెడపై, వెన్నుముకపై బలమైన గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సైఫ్ ప్రమాదం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. అయితే, దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే దుండగులు, భవనం ఫైర్ ఎస్కేప్ మెట్లపై నుంచి ఇంట్లోకి చొరబడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
తెల్లవారుజామున 2.30 గంటలకు పిల్లల గదిలో ఈ దాడి జరిగింది. దుండగుడిని గుర్తించిన ఇంటి పనివారు అప్రమత్తమయ్యారు. దీని తర్వాత సైఫ్ ఆ గదిలోకి ప్రవేశించారు. దుండగుడితో గొడవకు దిగాడు. ఈ గొడవలోనే అతడిపై ఆరు సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ గొడవలో పనిమనిషి చేతికి స్వల్పగాయమైంది.
Read Also: Saif Ali Khan: రక్తం కారుతున్న సైఫ్ అలీ ఖాన్‌ని “ఆటో”లో తీసుకెళ్లిన కొడుకు..
ప్రస్తుతం దుండగుడిని గుర్తించేందుకు పోలీసులు 10 టీమ్‌లను ఏర్పాటు చేశారు. దాడికి రెండు గంటల ముందు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే ఎవరూ సైఫ్ ఇంటిలోకి ప్రవేశించినట్లు కనిపించలేదని పోలీసులు గుర్తించారు. ‘‘రాత్రి ఒక నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఈ సంఘటన జరిగింది. నిందితుడు ఇంట్లోకి ప్రవేశించడానికి ఫైర్ ఎస్కేప్ మెట్లను ఉపయోగించాడు. ఇది దొంగతనానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అతను మెట్లను ఉపయోగించి ఇంట్లోకి ప్రవేశించాడు, ఇది ఫైర్ ఎస్కేప్‌గా కూడా పనిచేసింది. నిందితుడిని గుర్తించాము, ప్రస్తుతం పది బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి’’ అని డీసీసీ దీక్షిత్ గెడమ్ మీడియాతో చెప్పారు.
అదనపు సమాచారం కోసం సైఫ్ ఇంట్లో పనివాళ్లను ఐదుగురిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. అతడి ఇంట్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, ఈ పని చేస్తున్న వారిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రకారం.. రెసిడెన్షియల్ హౌసింగ్ సొసైటీలోకి దుండుగుడు ప్రవేశించడాన్ని సెక్యూరిటీ గార్డులు ఎవరూ చూడలేదు.