Su-57 stealth fighter jet: భారతదేశానికి రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన Su-57ను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి షరతులు లేకుండా టెక్నాలజీ ట్రాన్‌ఫర్ చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ CEO సెర్గీ చెమెజోవ్ దుబాయ్ ఎయిర్ షోలో అన్నారు. రష్యన్ Su-57 జెట్‌లను అమెరికా F-35 జెట్‌కు పోటీగా భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో 5వ తరం స్టెల్త్ ఫైటర్ టెక్నాలజీ కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా F-35 జెట్లను భారత్‌కు అమ్మాలని ప్రయత్నిస్తోంది.
ఇటీవల, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసిన తర్వాత రష్యా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇదిలా ఉంటే, డిసెంబర్ నెలలో పుతిన్ భారత్‌లో సందర్శించనున్నారు. ఈ సమయంలో భారత్-రష్యా మధ్య Su-57 జెట్ల ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, భారత్‌లో తయారీ:
భారత్‌కు పూర్తి స్థాయి సాంకేతికత బదిలీతో పాటు భారత్‌లోనే Su-57 జెట్లను తయారు చేసేందుకు రష్యా రెడీ అయింది. రష్యన్ కంపెనీ రోస్టెక్ CEO సెర్గీ చెమెజోవ్ మాట్లాడుతూ, భారతదేశం- రష్యా అనేక దశాబ్దాలుగా నమ్మకమైన రక్షణ భాగస్వాములుగా ఉన్నాయని అన్నారు. భారతదేశం అంతర్జాతీయ ఆంక్షల కింద ఉన్నప్పుడు కూడా, రష్యా భారతదేశ భద్రత కోసం ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉందని ఆయన పేర్కొన్నారు. తాము ఇదే విధానాన్ని అవలంభిస్తామని, భారత్ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల సైనిక పరికరాలను సరఫరా చేస్తామని,భవిష్యత్తు సహకారాన్ని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు.
భారత్‌కు టెక్నాలజీ బదిలీలో ఎలాంటి పరిమితులు ఉండవని రష్యా చెబుతోంది. ఇంజన్, రాడార్, స్టెల్త్ టెక్నాలజీ, ఆధునిక ఆయుధాల సమాచారన్ని కూడా భారత్‌కు అందించేందుకు సిద్ధంగా ఉంది. భారత్ కోరుకుంటే, Su-57ను భారతదేశంలోనే తయారు చేయవచ్చని కూడా రష్యా పేర్కొంది. రష్యా భారతదేశానికి ప్రాథమిక సైనిక సరఫరాదారుగా ఉంది. యుద్ధవిమానాలు, జలాంతర్గాములు, క్షిపణి వ్యవస్థలు, హెలికాప్టర్లు వంటివి రష్యా భారత్‌కు అందిస్తోంది.
సొంత జెట్ కోసం భారత్:
భారతదేశం తన సొంత 5వ తరం యుద్ధ విమానాలపై పని చేస్తోంది, ఇది 2-3 సంవత్సరాలలో పూర్తవుతుంది. ఏప్రిల్ 2024లో, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCS) ఐదవ తరం స్వదేశీ యుద్ధ విమానాల రూపకల్ప, అభివృద్ధి కోసం 15 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ఆమోదించింది. క్యాబినెట్ కమిటీ చెబుతున్న దాని ప్రకారం.. AMCA విమానం భారత వైమానిక దళంలో అన్నింటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఇది శత్రు రాడార్ నుంచి తప్పించుకోవడానికి అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉంటుంది.
S-400 వ్యవస్థల కోసం చర్చలు :
భారతదేశం మరికొన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కోసం రష్యాతో చర్చలు జరుపుతోంది. 10,000 కోట్ల విలువైన క్షిపణులను కొనుగోలు చేయడానికి కూడా సిద్ధమవుతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ క్షిపణులను, జెట్లను అడ్డుకోవడంతో S-400 వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఇది 300 కిలోమీటర్ల దూరంలోని 5-6 పాక్ యుద్ధ విమానాలను, ఒక గూఢచారి విమానాన్ని కూల్చివేసిందని తెలుస్తోంది.