RSS: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అనుబంధిత ముస్లిం రాష్ట్రీయ మంచ్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈద్ ఉల్ జుహా(బక్రీద్) సందర్భంగా ఆవులను దానం చేసి సేవించాలని నిర్ణయించినట్లు ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు ఆదివారం తెలిపారు. భోపాల్ లో జరిగిన ముస్లిం మంచ్ మేథోమథన సదస్సు ముగింపు రోజున ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. మంచ్ సభ్యులు యోగా దినోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భారతీయులందరికీ ఒకే మూలాలు, ఒకే డీఎన్ఏ ఉందని ఆయన అన్నారు.
ఈద్ ఉల్ జుహాపై ప్రజల్లో అపోహ ఉందని, దీనిని కొందరు బక్రా ఈద్ గా పిలుస్తారని ఆయన అన్నారు. బక్రా అంటే మేక అని కొందరు అర్థం చేసుకుంటారు, కానీ అరబిక్ ప్రపంచంలో బక్రా అంటే ఆవును సూచిస్తుందని తెలిపారు. ముస్లిం మంచ్ సభ్యులు ఆవులను సేవిస్తారని, వాటిని దానం చేస్తారని, వాటిని బలివ్వకూడదనే ప్రతిపాదనను ఆమోదించారని వెల్లడించారు. ఆవులను బలి ఇవ్వకూడదని మంచ్ విజ్ఞప్తి చేస్తుంది అని ఇంద్రేష్ కుమార్ అన్నారు.
Read Also: CPI Narayana: ప్రజాగర్జన సాక్షిగా.. సీఎం కేసీఆర్‌కి సీపీఐ నారాయణ సూటి ప్రశ్నలు
మంచ్‌లోని 2,500 యూనిట్లు యోగా దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలిపారు. యోగా శరీరం, మనస్సు, ఆత్మను స్వస్థపరిచే మార్గం అని, దీనికి కులం,మతంతో సంబంధం లేదని అన్నారు. మంచ్ సభ్యులు రక్షా బంధన్ కూడా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారని, ఇది మతపరమైన పండగ కాదని చెప్పారు. రక్షా బంధన్ అనేది మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన పండగ అని, పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు దీనిని పాటిస్తారని పేర్కొన్నారు. ప్రపంచంలో అల్లర్లు లేకుండా మతం, కులం వివక్షను తొలగించేందుకు రక్షాబంధన్ సందర్భంగా మంచ్ 100 చోట్ల భారీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు.
ఈ ఏడాది ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రజా సంప్రదింపు ప్రచారం నిర్వహిస్తారని, ఈ సందర్భంగా మంచ్ సభ్యులు 15 లక్షల కుటుంబాలను కలిసి, దేశంలో కలహాలు, వివక్ష రహితంగా మార్చడానికి, సోదరభావాన్ని వ్యాప్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘‘ఒకే దేశం, ఒకే చట్టం’’, జనాభా నియంత్రణ, లవ్ జిహాద్, యూనిఫా సివిల్ కోడ్ తీర్మానాలతో సహా 11 తీర్మానాలను ఆమోదించింది.