కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా.. 26 మందికి గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. హుబ్లీ నగర శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో లారీ, బస్సు డ్రైవర్లు స్పాట్ లోనే మరణించారు.
ప్రయాణికులతో బస్సు కోల్హాపూర్ నుంచి బెంగళూర్ కు వెళ్తుండగా… ఆదే సమయంలో ధార్వాడ్ వైపు వెళ్తున్న లారీని బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా ప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి 12.30 నుంచి 1 గంట మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే విధంగా మూడు రోజుల క్రితం కర్ణాటకలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. ధార్వాడ్ లో క్రూజర్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ధార్వాడ్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదా గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. నిశ్చితార్థ వేడుకలు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ధార్వాడ్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మరవక ముందే హుబ్లీలో మరో ప్రమాదం జరిగింది.