Shirdi: ఏపీలోని తిరుమల తర్వాత దేశంలో హుండీ ఆదాయం అధికంగా ఉన్న ఆలయం మహారాష్ట్రలోని షిర్డీ మాత్రమే. కరోనా తర్వాత ఆంక్షలు సడలించడంతో షిర్డీ సాయినాథుడిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో షిర్డీ సాయినాథునికి రికార్డు స్థాయిలో హుండీ కానుకలు వచ్చి చేరుతున్నాయి. గత ఏడాది అక్టోబర్ నుండి ఈ నవంబర్ వరకు బాబా సంస్థాన్‌కు రూ.398 కోట్ల కానుకలు వచ్చాయి. ఈ విషయాన్ని సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగ్యశ్రీ బనాయత్ వెల్లడించారు. సుమారు మూడు కోట్ల మంది భక్తులు ప్రపంచ దేశాల నుండి వచ్చినట్లు ఆమె తెలిపారు.
Read Also: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంది వీళ్లకే
కాగా షిర్డీ సాయినాథుడికి వచ్చిన కానుకల్లో 27 కిలోల బంగారం, 3,056 కిలోల వెండితో పాటు డీడీలు, చెక్కులు, నగదు ఉన్నాయి. విరాళాల రూపంలో రూ.77,89,04,984, హుండీలో కానుకల రూపంలో రూ.1,68,88,52,560, చెక్కులు, డీడీల రూపంలో రూ.19,68,41,408, డెబిట్, క్రెడిట్ కార్డు డొనేషన్ ద్వారా రూ.42,00,42,120, మనీ ఆర్డర్ల ద్వారా రూ.2,29,76,564 నగదు సాయినాథుడికి చేరింది. కాగా సాయిబాబా ఆలయంలో సమాధిని చేతితో తాకి దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో బాబా విగ్రహాన్ని దూరం నుంచి దర్శించుకుని భక్తులు బయటకు వెళ్లేవారు. విగ్రహం ఎదురుగా ఉన్న సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్ వల్ల తాకేందుకు వీలు లేకుండా పోయేది. దీంతో సమాధి చుట్టూ అమర్చిన అద్దాల ఫ్రేమ్‌ను తొలగించాలని సాయి సంస్థాన్ అధికారులు నిర్ణయించారు.