Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధురి మరోసారి ఢిల్లీ సీఎం అతిషీని టార్గెట్ చేశారు. ఇప్పటికే అతిషీ తన తండ్రి పేరును మార్చిందని వ్యాఖ్యలు చేసిన బిధురి ఈసారి.. ఆమె ‘‘జింక’’లా తిరుగుతోందని కామెంట్స్ చేశారు. ఈ ఇద్దరు నేతలు రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బుధవారం ఆయన చేసిన వ్యాఖ్యల కొత్త వివాదానికి దారి తీశాయి.
ఓ ర్యాలీలో రమేష్ బిధురి మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా అతిషీ ప్రజలను కలవలేదు, ఇప్పుడు ఓట్లను పొందేందుకు జింకలా తిరుగుతున్నారని అన్నారు. ‘‘ ఢిల్లీ ప్రజలు వీధుల్లో నరకం అనుభవిస్తున్నారు. అతిషీ ఎప్పుడూ ప్రజల్ని కలిసేందుకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో జింక అడవిలో పరిగెత్తినట్లుగా ఆమె ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆప్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.
Read Also: Formula E- Race Case: లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసు విత్ డ్రా చేసుకున్నాం- అడ్వకేట్..
గతంలో బిధురి, అతిషీ తన తండ్రిని మార్చేసిందని వ్యాఖ్యానించారు. జనవరి 6న దేశ రాజధానిలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మార్లేనాగా ఉన్న అతిషీ ఇప్పుడు సింగ్ అయ్యారు. ఆమె తన తండ్రి పేరుని కూడా మార్చేసింది’’ అని అన్నారు. ‘‘ఈ మర్లెనా(అతిషీ) సింగ్ అయింది. ఆమె తన పేరు మార్చుకుంది. అవినీతిపరులైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనని అరవింద్ కేజ్రీవాల్ తన పిల్లలపై ప్రమాణం చేశాడు. మార్లేనా ఇప్పుడు తండ్రిని మార్చింది. ఇది ఆప్ నిజస్వరూపం’’ అని అన్నారు.
బిధురి వ్యాఖ్యల్ని ఆప్ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ అన్ని పరిమితుల్ని దాటిందని అన్నారు. బీజేపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, మహిళా సీఎంని అవమానించడాన్ని ఢిల్లీ ప్రజలు సహించరని, మహిళలంతా ప్రతీకారం తీర్చుకుంటారని కేజ్రీవాల్ అన్నారు. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంది.