జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌కు షాక్ తగిలింది. బెంగళూరులో జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఆయనపై కొందరు వ్యతిరేకులు దాడి చేశారు. అంతేకాకుండా నల్ల సిరా కూడా చల్లారు. రాకేష్ టికాయత్ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చి కుర్చీలు విసిరి కొందరు దాడికి పాల్పడ్డారు. కొంతకాలంగా రాకేష్ టికాయత్ వర్గానికి, చంద్రశేఖర్ వర్గానికి వైరం నడుస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ వర్గమే కావాలని తనపై దాడి చేసిందని రాకేష్ టికాయత్ ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు తమకు ఎలాంటి భద్రతా కల్పించలేదని మండిపడ్డారు. రైతు నిరసనలకు చిక్కులు సృష్టించాలని కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని రాకేష్ టికాయత్ విమర్శలు చేశారు. ప్రభుత్వంతో పోలీసులు కుమ్మక్కయ్యారన్నారు. కాగా ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరిపిన కిసాన్ సంయుక్త మోర్చా సమన్వయ కమిటీ ఏడుగురు సభ్యుల్లో రాకేష్ టికాయత్ ఒకరు.