నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయిన గంట అనంతరం.. ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇటీవల మొత్తం 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా.. 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి.
జూన్- ఆగస్టు మధ్య వివిధ తేదీల్లో 57 మంది ఎంపీల పదవీకాలాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలున్నాయి. రెండు అధికార పార్టీలకు భారీ మెజారిటీ ఉండడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బలం తగ్గనుంది. అలాగే, ఇటీవలే పెద్దల సభలో 100 మార్కు చేరుకున్న భాజపా బలం సైతం నూరులోపే పరిమితం కానుంది.