నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరగనుంది. హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణకు ఈసీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బలం తగ్గనుంది. అలాగే, ఇటీవలే పెద్దల సభలో 100 మార్కు చేరుకున్న భాజపా బలం సైతం నూరులోపే పరిమితం కానుంది. ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపొందే వారంతా జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.
ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేందుకు పార్టీలు వారిని రిసార్టులకు తరలించాయి. కాగా, ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సూర్జేవాలా, జైరాం రమేశ్, ముకుల్ వాస్నిక్, శివసేనకు చెందిన సంజయ్ రౌత్ భవితవ్యం తేలనుంది. రాజస్థాన్‌లో ఇప్పటికే రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయి. రాజస్థాన్‌లో 4 స్థానాలకు పోటీ ఏర్పడడంతో బీజేపీ ఎమ్మెల్యేలను జైపూర్‌లోని దేవీ రతన్ రిసార్ట్‌కు తరలించింది అధిష్టానం. ఇటు కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.
Asaduddin Owaisi: ఇలా ఎఫ్ఐఆర్ చూడటం ఇదే తొలిసారి.. తనపై నమోదైన కేసుపై ఓవైసీ
రెండు స్థానాలున్న హరియాణాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ ఓ అభ్యర్థి గెలవాలంటే 31 ఓట్లు కావాలి. సరిగ్గా అంతే బలం ఉన్న కాంగ్రెస్ నుంచి అజయ్ మాకెన్ బరిలోకి దిగుతున్నారు. ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు దక్కనీయకుండా చేసేందుకు ఇక్కడా మరో మీడియా అధిపతి కార్తికేయ శర్మ స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఇక్కడ భాజపా ఆయనకు మద్దతిస్తోంది. దీంతో రాజస్థాన్, హరియాణాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా భాజపా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
కర్ణాటకలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటకలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. జేడీఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మాజీ ప్రధాని దేవెగౌడ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయన సోనియా గాంధీతో ఫోన్‌లో చర్చలు జరిపారు. మహారాష్ట్రలో కూడా రాజకీయం రోజురోజుకు వేడెక్కుతుంది. ఇప్పటికే అధికార పార్టీ శివసేన తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.