Rajnath Singh: మరికొన్ని నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ విమర్శలు ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు పలువురు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలు మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కి వెళ్లిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీపై మంగళవారం విమర్శలు గుప్పించారు.
రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి ప్రజలను వచ్చించేందుకు కాంగ్రెస్ ఐదు హామీలను ఇస్తోందని ఆరోపించారు. రాజ్‌గఢ్‌లో జరిగిన ‘కిసాన్ కళ్యాణ్ మహాకుంభ్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు రోజు ప్రియాంకా గాంధీ నర్మదా నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రియాంకా గాంధీని ఉద్దేశిస్తూ రాజ్ నాథ్ సింగ్.. ‘‘ కాంగ్రెస్ లో కొందరు వ్యక్తులు సీజనల్ హిందువులుగా మారారు. ఇంతకు ముందు నర్మదా జీని ఎందుకు గుర్తుకు రాలేదని, ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది.’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారు ఇప్పుడు సమావేశాలు, కార్యక్రమాలు పెట్టి హనుమంతుడి గదను మోస్తున్నారని, ఇంతకుముందు వారు రాముడు, హనుమాన్ పేర్లను ఉచ్చరించే వారు కాదని ఆయన అన్నారు.
Read Also: Mosquito Bite: దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా..? సబ్బు కూడా కారణం కావచ్చు..
కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టేందుకు ఐదు హామీలు ఇస్తామని చెబుతోందని, కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హామీలు ఇస్తుంది కానీ ఎప్పుడు నెరవేర్చదని రాజ్ నాథ్ సింగ్ విమర్శించారు. బీజేపీ హామీలను నెరవేరుస్తుందన్నారు. సీఎం శివరాజ్ సింగ్ కు ప్రజామద్దతు ఉందని, ఈసారి మరింత మెజారిటీతో మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ వ్యవసాయ బడ్జెట్ ను రూ. 25,000 కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు పెంచిందని, రామమందిర నిర్మాణాన్ని చేపడుతోందని, రక్షణ రంగంలో అభివృద్ది చెందామని, మహిళ కోసం సైనిక్ స్కూల్స్ తో పాటు ఆర్మీలో మహిళలు ఎక్కువగా చేరుతున్నారని ఆయన అన్నారు. దేశంలో డిజిటల్ విప్లవం జరుగుతోందని ఆయన వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని 60 లక్షల ఇళ్లకు పైపుల ద్వారా నీటి సరఫరాను అందుబాటులోకి తెచ్చామని రక్షణ మంత్రి తెలిపారు.