Rajnath Singh: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ డైనోసార్‌ల లాగే మరికొన్నాళ్లలో అంతరించిపోతుందని, ఆ పార్టీలో అంతర్గం పోరు రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ని తలపిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి నాయకుల వలసలు కొనసాగుతున్నాయని, వారు ఒకరి తర్వాత ఒకరు పార్టీని విడిచి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.
మరికొన్నేళ్లలో డైనోసార్ల లాగా కాంగ్రెస్ అంతరించిపోతుందేమో అని భయంగా ఉందని, 2024 తర్వాత కొన్నేళ్లలోనే కాంగ్రెస్ పేరు చెబితే, పిల్లలు ఎవరని అడుగుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరితో ఒకరు గొడవలు పడుతున్నారని, పార్టీ తీరు బిగ్‌బాస్ హౌజ్ లా మారిందని, వారు రోజూ ఒకరి బట్టలు ఒకరు చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో భారత్ బలమైన దేశంగా మారిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తన వాణిని బలంగా వినిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 22,500 మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో ప్రధాని మోడీ చర్చలు జరిపి నాలుగు గంటలకు పైగా యుద్ధాన్ని నిలిపేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Read Also: Pakistan: మాపైనే రైడ్స్ చేస్తారా.? పోలీసులను చితక్కొట్టిన పాక్ ఆర్మీ.. వీడియో వైరల్..
ప్రపంచ భవిష్యత్తు చూడాలంటే భారత దేశానికి రావాలని భారత్‌తో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పిన మాటల్ని కూడా ఆయన ఉటంకించారు. ప్రస్తుతం మనం మన రక్షణ పరికరాలను దేశంలోనే తయారు చేస్తున్నామని, గత 7 ఏళ్లలో రక్షణ రంగ ఎగుమతుల్ని రూ. 600 కోట్ల నుంచి రూ. 21,000 కోట్లకు పెంచామని చెప్పారు. బీజేపీ తాను చెప్పిన హామీలను యథాతథంగా అమలు చేస్తుందని చెప్పారు. ఇందుకు ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), అయోధ్య రామ మందిరం గురించి చెప్పారు. కాంగ్రెస్ వంటి పార్టీలు తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, హామీల్లో 50 శాతం నెరవేర్చినా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండేదని అన్నారు.