Rajasthan Congress crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సీఎం అశోక్ గెహ్లాట్ చేపడుతారనే వార్తల నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమాలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తన సీఎం అశోక్ గెహ్లాట్ నామినేషన్ దాఖలు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు యువనేత సచిన్ పైలెట్ రాజస్థాన్ కు కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీలో వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో.. అశోక్ గెహ్లాట్ తన పదవిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండేలా ఒప్పించేందుకు అశోక్ గెహ్లాట్ తన వంత ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీనే అధ్యక్షుడు కావాలని తీర్మాణ చేసిన మొదటి రాష్ట్రం కూడా రాజస్థానే. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి కాంగ్రెస్ ఎమ్యెల్యేలు సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ కొనసాగుతారని మంత్రి ప్రతాప్ సింగ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ముఖ్యమంత్రి, పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అశోక్ గెహ్లాట్.
Read Also: Hijab Row: హిజాబ్ అల్లర్ల వెనక ఆ సంస్థ కుట్ర.. సుప్రీంకు తెలిపిన కర్ణాటక ప్రభుత్వం
అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేసే ఉద్దేశ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదటగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఒప్పించేందుకు అశోక్ గెహ్లాట్ కొచ్చిన్ వెళ్లనున్నారు. రాష్ట్రంలో అధికార వ్యతిరేకత లేదని.. ముఖ్యమంత్రి ప్రజలకు దూరం కాలేదని మంత్రి ప్రతాప్ సింగ్ అన్నారు. ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ కేరళలో సాగుతున్న ‘భారత్ జోడో యాత్ర’ కోసం కేరళ వెళ్లారు. ఇప్పటికే రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్ 22న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు తేదీలను ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8గా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ 17న ఎన్నిక, అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరగనుంది.