Air India: న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన శంకర్ మిశ్రా అనే వ్యక్తిని కనుక్కునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. నిందితుడు ముంబైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారనే విషయం తెలిసి అతని సొంత నగరం ముంబైకి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీలైనంత త్వరగా అతడిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు.
Read Also: Thunivu: తగ్గేదే లే అంటున్న అజిత్… బాక్సాఫీస్ వార్ కి రెడీ
ఇప్పటికే ఎయిర్ ఇండియా అతడిపై 30 రోజుల నిషేధం విధించింది. ఢిల్లీలోని పోలీసులు లైంగిక వేధింపులు, అశ్లీలతకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఎయిర్ లైన్స్ రెగ్యులేటర్ డీజీసీఏ, ఎయిర్ ఇండియా నుంచి నివేదిక కోరింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోనుంది. నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయాన్ని సదరు మహిళ ఎయిర్ ఇండియా టాటా సన్స్ దృష్టికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మూత్ర విసర్జన చేయడంతో తను ప్రయాణించిన సీటు తడిసిపోయిందని.. దాంట్లోనే ప్రయాణించాల్సి వచ్చిందని, సిబ్బంది నుంచి కూడా ఎలాంటి సహాకారం అందలేదని ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఎయిర్ లైన్స్ అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. ఈ ఘటనలో చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియా కంపెనీ బాస్ ఎన్ చంద్రశేఖరన్ కు లేఖ రాసింది. ఏడు రోజుల్లో ఢిల్లీ పోలీసుల నుంచి వివరణాత్మక నివేదిక కోరింది. మహిళ గౌరవాన్ని, సురక్షితంగా జీవించే హక్కును ఈ చర్య ఉల్లంఘిస్తుందని అభిప్రాయపడింది.