Rahul with ‘tukde tukde gang’, anurag thakur comments: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై ఇటు బీజేపీ, అటు శివసేన పార్టీలు ఫైర్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తుక్డే తుక్డే గ్యాంగ్’తో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. జెఎన్‌యు (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ)లో భారతదేశాన్ని విభజించడానికి ప్రయత్నించిన వ్యక్తులతో కలిసి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ మనస్తత్వం.. వారు ఒక కుటుంబానికి మించి ఏమీ చూడలేదరని అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
Read Also: Marri Shashidhar Reddy Live: కాంగ్రెస్ కి షాక్… బీజేపీలోకి మర్రి శశిధర్ రెడ్డి ?
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ రాష్ట్రాన్ని అల్లర్ల లేకుండా చేశారని ఆయన ప్రశంసించారు. గుజరాత్ ఎంత అభివృద్ధి చెందిందో.. భారత్ కూడా అంత అభివృద్ధి చెందుతుందని.. గుజరాత్ లో బీజేపీ గెలిస్తే భారత్ పురోగమిస్తుందని మంగ్రోల్ లో జరిగిన బహిరంగ సభలో అనురాగ్ ఠాకూర్ అన్నారు. సుపరిపాలన, అభివృద్ధి, నిజాయితీ ప్రాతిపదికన బీజేపీ పనిచేస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ విభజించు ప్రాతిపదికన మాత్రమే రాజకీయాలు చేస్తుందని.. వారు కులం, వర్గం, మతాల ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని అన్నారు.
మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర జరుగుతోంది. అయితే ఇటీవల రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీర్ సావర్కర్ జైలు నుంచి విడుదల కావడానికి బ్రిటీష్ వారికి విధేయుడిగా మారి మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటెళ్లకు ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను శివసేన, బీజేపీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.