Kiren Rijiju: రాహుల్ గాంధీ భారతదేశ భద్రతకు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా మారారని, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారని, మావోయిస్టులు, తీవ్రవాదుల్ని కలుస్తున్నారని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్రలో ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని చెప్పారు.
తాజాగా జరిగిన పార్లమెంటరీ వ్యవహారాలపై రిజిజు మాట్లాడుతూ.. ‘‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎల్లప్పుడూ శబ్దం మరియు గందరగోళం ఉంటుంది. ప్రతి పార్టీకి దాని స్వంత ఎజెండా ఉంటుంది, దానిపై సభలో ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అది స్వయంగా వైఫల్యం కాదు. కానీ గందరగోళంతో పాటు, ఎలాంటి చర్యలకు పాల్పడ్డారో మనం చూడాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము స్పీకర్‌పై కాగితాలు విసిరలేదు, పాలక పక్షానికి వ్యతిరేకంగా బ్యానర్లను తీసుకెళ్లలేదు. ఇవన్నీ నేను కలత చెందడానికి ఇదే కారణం.’’ అని ఆయన అన్నారు.
READ ALSO: T20 World Cup 2026: శ్రీలంక, జింబాబ్వే చేతిలో పరాజయం.. ఆస్ట్రేలియా పతనానికి అసలు కారణాలు ఇవే?
రాహుల్ గాంధీ తన స్థాయిని మరిచిపోయి, పిల్లతనం, బాధ్యతారహితంగా వ్యవహరించారని కేంద్రమంత్రి అన్నారు. ప్రతిపక్ష నేత మొత్తం ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం వహిస్తారని, సభ వెలుపలికి వెళ్లడం, ప్రజలను దేశద్రోహులుగా పిలువడం, నిరసనల పేరుతో డ్రామాలు చేయడం, ప్రచురించని పుస్తకాన్ని ప్రస్తావించడం ఇవన్నీ చిన్న పిల్లల చేష్టలు అని ఆయన అన్నారు. పార్లమెంట్ బయట కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టును రాహుల్ గాంధీ ‘‘ద్రోహి’’గా పిలువడాన్ని కిరెన్ రిజిజు తప్పుపట్టారు.
రాహుల్ గాంధీకి దేశవ్యతిరేక శక్తులు, జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆయన భారతదేశ భద్రతకు ప్రమాదకరంగా మారారని, విదేశాల్లో దేశవ్యతిరేకుల్ని కలుస్తున్నారని రిజిజు అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో పరిణితి చెందిన నాయకులు ఉండేవారని, నెమ్మదిగా కాంగ్రెస్ రాహుల్ గాంధీలా మారిందని, అతడి చుట్టూ తిరుగుతోందని విమర్శించారు. మూడు సార్లు ఓడిపోయిన తర్వాత కూడా అదే వ్యక్తిని నాయకుడిగా కొనసాగిస్తున్నారని, బీజేపీలో ఇలా ఉండదు అని చెప్పారు.