Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కుల గణనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి యూపీలోని బరేలీ జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది. జనవరి 7వ తేదీన న్యాయస్థానానికి హాజరు కావాలని పేర్కొనింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పంకజ్ పాఠక్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆయన కామెంట్స్ దేశంలో అంత్యర్ధం, విభజన, అశాంతిని ప్రేరేపించే ఛాన్స్ ఉందని పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తోసిపుచ్చింది. దాంతో తాజాగా తాను జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.
అయితే, హైదరాబాద్ నగరంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కులగణనపై మాట్లాడారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీపై విమర్శులు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన వారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి దేశవ్యాప్త కుల గణనను చేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామన్నారు. ఈ కామెంట్స్ పై పంకజ్ పాఠక్ అనే వ్యక్తి కోర్టుకు వెళ్లినట్లు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి.