పంజాబ్‌కు చెందిన ప్రముఖు ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అదేష్ మెడికల్ యూనివర్సిటీలో శవమై కనిపించింది. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలికి చేరుకుని కళాశాల పార్కింగ్ స్థలంలో కారులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి బటిండా-చండీగఢ్ జాతీయ రహదారిపై ఉన్న అదేష్ మెడికల్ యూనివర్సిటీలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్‌గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Honeymoon Murder: రాజా రఘువంశీ-సోనమ్‌కి పెళ్లి కుదిర్చింది ఎవరు? బంధువు ఏం చెప్పాడంటే..!
వాహనానికి లూథియానా రిజిస్ట్రేషన్ ప్లేట్లు ఉన్నాయి. ఇక కారు వెనుక సీటులో మృతదేహం కనిపించింది. మృతదేహం ముందుగా పోలీసులు గుర్తుపట్టలేకపోయారు. కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంటే చనిపోయి ఎక్కువ రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు. కారులోంచి దుర్వాసన రావడంతో తమకు సమాచారం అందించారని బతిండా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) నరేంద్ర సింగ్ తెలిపారు. లూథియానాకు చెందిన కాంచన్ కుమారి అలియాస్ కమల్ కౌర్ (30)గా గుర్తించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి:Trump Gold Card: త్వరలో ట్రంప్ కార్డ్.. గోల్డ్ కార్డు వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు
జూన్ 9న కమల్ కౌర్ ఇంటి నుంచి బయల్దేరినట్లుగా పోలీసులు తెలిపారు. ఒక ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బతిండా వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయల్దేరిందన్నారు. ఆ రోజు నుంచి కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. అంటే ఆరోజే ఆమె హత్యకు గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కమల్ కౌర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 383,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. కారు నడిపిన వ్యక్తి.. పార్కింగ్‌లో కారు పార్కు చేసి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. అయితే ఆమెకు ఆన్‌లైన్‌లో అనేక వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించి వీడియోలు పోస్టు చేయడంతో ప్రసిద్ధి చెందింది. ఆ కోణంలో ఏమైనా హత్య జరిగిందేమోనని దర్యాప్తు చేస్తున్నారు.