Food Poisoning: పంజాబ్‌లో విషాదం చోటు చేసుకుంది. పుట్టిన రోజు సందర్భంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్ తిని 10 ఏళ్ల బాలిక మరణించింది. ఈ ఘటన గత వారం జరిగింది. చిన్నారి ఫుడ్ పాయిజనింగ్ వల్ల మరణించింది. పాటియాలాలోని ఓ బేకరి నుంచి తెప్పించిన కేక్ తిన్న తర్వాత బాలికతో పాటు ఆమె సోదరి, బాలిక కుటుంబమంతా తీవ్ర అస్వస్థతకు గురైందని ఆమె తాతా తెలిపాడు. బాలిక మాన్వికి సంబంధించిన బర్త్ డే ఫోటోలు మరణించిన తర్వాత వైరల్ అయ్యాయి. కుటుంబంతో కేక్ కట్ చేసి ఎంతో సంతోషంగా ఉన్న బాలిక మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Read Also: CM YS Jagan: 7 కిలోమీటర్ల మేర సీఎంతో పాటు కదిలిన జనప్రభంజనం
మార్చి 24వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో మాన్వి బర్త్ డే కేక్ కటింగ్ కార్యక్రమం పూర్తయింది. ఆ తర్వాత కుటుంబమంతా కేక్ తిన్నారు. రాత్రి 10 గంటలకు బాలికతో పాటు కుటుంబం అంతా వాంతులు చేసుకోవడం ప్రారంభమైంది. మాన్వి విపరీతమై దాహంతో నోరు ఎండిపోయిందని చెప్పిందని ఆమె తాత చెప్పారు. ఆ తర్వాత ఆమె నిద్రకు ఉపక్రమించిందని తెలిపారు.
మరుసటి రోజ ఉదయం బాలిక ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆక్సిజన్ అందించి, అత్యవసర చికిత్స చేసినా, బాలిక ప్రాణాలు కాపాడలేకపోయారు. ‘‘కేక్ కన్హా’’ నుంచి ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్‌లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని కుటుంబం ఆరోపిస్తోంది. బేకరీ యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశామని, కేక్ శాంపిళ్లను పరీక్ష నిమిత్తం పంపామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని పోలీసులు తెలిపారు.