Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు. అస్వస్థతకు గురైన మాన్‌ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ముఖ్యమంత్రికి కడుపునొప్పి రావడంతో ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, పంజాబ్ సీఎం ఆస్పత్రిలో చేరడంతో.. అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
బుధవారం అమృత్‌సర్ సమీపంలో పంజాబ్ పోలీసులతో భారీ ఎదురుకాల్పుల్లో ఇద్దరు సిద్ధూ మూసేవాలా హంతకులు హతమైన తర్వాత రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్లకు వ్యతిరేకంగా ఆపరేషన్ విజయవంతంగా అమలు చేసినందుకు పోలీసులు, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను బుధవారం ముఖ్యమంత్రి అభినందించారు. హతమైన గ్యాంగ్‌స్టర్లను జగ్రూప్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్‌లుగా గుర్తించారు. వీరి నుండి ఒక ఏకే 47, పిస్టల్‌ను ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని గ్యాంగ్‌స్టర్‌లు, సంఘవ్యతిరేక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక యుద్ధాన్ని ప్రారంభించిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అమృత్‌సర్‌లో గ్యాంగ్‌స్టర్ వ్యతిరేక ఆపరేషన్‌లో విజయం సాధించినందుకు పోలీసులను అభినందించింది.
Karnataka Ambulance Crash: ఘోర అంబులెన్స్ ప్రమాదం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రిగా మార్చి 16న ప్రమాణ స్వీకారం చేశారు, ఇటీవల ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు గెలుచుకుని భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 117 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 18 సీట్లు గెలుచుకుంది.