ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తవ్వేకొద్దీ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక ఆరోపణలు రావడంతో ఆమె శిక్షణ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయినా కూడా ఆమెకు సంబంధించిన వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
తాజాగా దివ్యాంగ ధ్రువీకరణ పత్రం కోసం ఆమె ఒక ఫ్యాక్టరీ అడ్రస్ పేర్కొంది. యూపీఎస్‌సీ పరీక్షల్లో అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ ఆస్పత్రి 2018, 2021లో జారీ చేసి ఆయా వికలాంగ పత్రాలను సమర్పించింది. అటు తర్వాత 2022లో కూడా ఔధ్ ఆస్పత్రిలో వైకల్య ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసుకుంది. కాకపోతే ఈ ఆస్పత్రి తిరస్కరించింది. అనంతరం ఆమెకు 2022, ఆగస్టు 24న యశ్వంత్ రావ్ మెమోరియల్ ఆస్పత్రిలో వైకల్య ధ్రువీకరణ పత్రం లభించింది. అందులో ఆమె చించ్వాడ్‌లో ఉన్న ఓ ఫ్యాక్టరీ చిరునామా ఇచ్చింది. కానీ ఆమె సమర్పించిన అడ్రస్‌లో మాత్రం ఓ ఇంజినీరింగ్ కంపెనీ ఉంది. ఇక ఆమె ఉపయోగించిన ఆడీ కారు కూడా ఇదే కంపెనీ పేరుతో రిజిస్టరై ఉంది. ఆ కంపెనీ స్థానిక పురపాలక సంఘానికి రూ.2.7 లక్షల పన్నులు బకాయి పడినట్లు రికార్డుల్లో ఉంది.
ఇదిలా ఉంటే వికలాంగ ధ్రువీకరణ కోసం ఆధార్‌కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. కానీ ఆమె మాత్రం రేషన్ కార్డే సమర్పించింది. తీరా చూస్తే.. ఆ రేషన్ కార్డు కూడా నకిలీదిగా తేలింది. తప్పుడు చిరునామాతో ఆ రేషన్ కార్డు పొందినట్లుగా అధికారులు తాజాగా గుర్తించారు.
ఇక విచిత్రమేంంటే ఆమెది లోకోమార్ వైకల్యంగా ధ్రువీకరణలో వైద్యులు పేర్కొన్నారు. మోకాలికి సంబంధించిన పాత గాయం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో ఏడు శాతం వైకల్యం ఉన్నట్లు తేల్చారు. యూపీఎస్సీలో రిజర్వేషన్ పొందాలంటే కచ్చితంగా 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉండకూడదు అనే నిబంధన ఉంది. కానీ పూజా ఆ కేటగిరిలోనే ఎలా ఉద్యోగం సంపాదించింది అనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
చదువు, క్యాస్ట్, వికలాంగ సర్టిఫికెట్లు ఇలా అన్ని కూడా నకిలీవిగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఆమెకు సంబంధించిన వివాదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పడడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెల 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఆమెను విధుల నుంచి రిలీవ్ చేస్తున్నట్లు సాధారణ పరిపాలన విభాగం ఇప్పటికే ప్రకటించింది.
చుట్టూ వివాదాలు చుట్టుముట్టడంతో పూజా ఖేద్కర్ కూడా ఎదురుదాడి మొదలు పెట్టింది. పూణె కలెక్టర్ వేధిస్తున్నారంటూ మంగళవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాషిమ్ పోలీస్ స్టేషన్‌లో కలెక్టర్ సుహాస్ దివాసేపై పోలీసులకు పూజా ఫిర్యాదు చేసింది. మరోవైపు కేంద్రం ఏకసభ్య కమిటీ వేసింది. మరికొద్ది రోజుల్లో నివేదిక అందజేయనున్నారు.